కానుకలన్నీ భద్రంగానే వున్నాయి, పుకార్లు నమ్మవద్దు : అయోధ్య ట్రస్ట్
అయోధ్య శ్రీరాముడికి ఇచ్చిన కానుకలు, విరాళాలు, వెండి ఇటుకలు, ఆభరణాలు అన్నీ సురక్షితంగానే వున్నాయని రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామా చేసిన మాట వాస్తవమేనని ట్రస్ట్ అంగీకరించింది. శ్రీరాముడి కానుకల విషయంలో వివాదం రేగిన నేపథ్యంలో ట్రస్ట్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఆలయ విరాళాల విషయంలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించిన ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందదేవ్ గిరి, భక్తుల నమ్మకాన్ని కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
భక్తులు శ్రీరాముని సేవ కోసం ట్రస్ట్ అధికారులకు స్వయంగా అందజేసిన వెండి ఇటుకలు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు అన్నీ పూర్తి లెక్కలతో, పక్కాగా సురక్షితంగా ఉన్నాయని, ఈ విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళనలకు లేదా సంశయాలకు లోనుకావాల్సిన అవసరం లేదని ఈ ప్రకటన ద్వారా ట్రస్ట్ స్పష్టమైన హామీ ఇచ్చింది. దేశవిదేశాల నుండి వచ్చే భక్తులు ఆలయానికి సమర్పించిన కానుకలపై వస్తున్న పుకార్లను ట్రస్ట్ తీవ్రంగా ఖండించింది.
రామ మందిరానికి ఇచ్చిన కానుకలన్నింటికీ రికార్డులు పక్కగా వున్నాయని తెలిపింది. భక్తుల విశ్వాసాన్ని తిరిగి చూరగొనేలా నిష్పాక్షిక విచారణకు ట్రస్టు నుంచి అన్ని విధాలా సహకారం వుంటుందని తెలిపింది. హుండీల ద్వారా వచ్చిన డబ్బు దుర్వినియోగ అయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం నియమించిన సిట్ నుంచి మధ్యంతర నివేదిక రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయించామని, ఇలాంటి ఘటనలు ఇక మీదట జరగనివ్వమని హామీ ఇచ్చింది.








