ఏపీ ప్రజలకు అలర్ట్.. వాతావరణంలో కీలక మార్పులు..!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ద్రోణుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ వాతావరణాన్ని రెండు ప్రధాన ఉపరితల ద్రోణులు ప్రభావితం చేస్తున్నాయి.
ఇందులో మొదటిది ఉత్తరాంధ్ర తీరం నుంచి ప్రారంభమై ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి ఉంది. ఇక రెండవ ద్రోణి రాయలసీమ మీదుగా కిందనున్న కొమోరిన్ ప్రాంతం వరకు కొనసాగుతోంది. ఈ రెండు ద్రోణుల తీవ్రత కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోకి తేమతో కూడిన గాలులు భారీగా వీస్తున్నాయి. ద్రోణుల ప్రభావంతో కోస్తాంధ్రాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. రాయలసీమ రీజియన్లో మాత్రం వాతావరణం కొద్దిగా భిన్నంగా ఉండనుంది.
రాయలసీమలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉపరితల ద్రోణుల కదలికల వల్ల అకస్మాత్తుగా బలమైన గాలులు వీచే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలతో పాటు పొలాల్లో పనులు చేసుకునే రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని హెచ్చరించారు.








