అనిరుధ్- కావ్య పెళ్లి వార్తలపై క్లారిటీ
కొద్ది రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), సన్రైజర్స్ హైదరాబాద్(SRH) ఓనర్ కావ్య మారన్(Kavya Maran) పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల అంగీకారం లభించిందని, త్వరలోనే పెళ్లి జరగనుందంటూ పలు కథనాలు వైరల్ కావడంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అనిరుధ్ బంధువు చేసిన కామెంట్స్ కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చాయి. దీంతో అభిమానుల్లో ఈ వార్తపై ఆసక్తి పెరిగింది.
అయితే ఈ ప్రచారంపై కావ్య మారన్ టీమ్ రియాక్ట్ అయింది. అనిరుధ్తో కావ్యకు పెళ్లి జరగబోతోందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ, అధికారిక సమాచారం లేకుండా వస్తున్న రూమర్లను నమ్మవద్దని సూచించారు. దీంతో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది.
అనిరుధ్ పర్సనల్ లైఫ్ పై ఇలాంటి ప్రచారం రావడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో కూడా పలువురు సినీ ప్రముఖులతో ఆయన పేరు ముడిపెడుతూ పుకార్లు వినిపించినా, అవి నిజం కాలేదు. మరోవైపు కావ్య మారన్ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ జట్టు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుండగా, అనిరుధ్ వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి సమాచారం నిజం కాదనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.








