తోతాపురి మామిడి రైతులకు గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి మామిడి రైతులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా తగిన మద్దతు లభించేలా చూడాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు ఒక లేఖ రాశారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్రం ప్రత్యేకంగా ‘ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం’ (ధరల వ్యత్యాస చెల్లింపు పథకం) అమలు చేయాలని ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు.
దేశంలోనే మామిడి సాగు మరియు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అగ్రస్థానంలో కొనసాగుతోందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 3.99 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి తోటలు సాగవుతున్నాయని, వీటి ద్వారా ఏటా రికార్డు స్థాయిలో 52.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని ప్రాథమిక గణాంకాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంత భారీ స్థాయిలో సాగవుతున్న పంటకు మార్కెట్లో ఆశించిన ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.
రాష్ట్రంలో విరివిగా పండే తోతాపురి మామిడి రకం రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం చొరవ చూపాలని చంద్రబాబు కోరారు. తోతాపురి రైతులకు మేలు జరిగేలా సుమారు 7.03 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లకు గానూ, కేంద్ర ప్రభుత్వం తరపున రూ.281 కోట్ల మేర ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. కేంద్రం నుండి ఈ నిధులు అందితే రైతులకు మార్కెట్ ఒడిదుడుకుల నుండి పెద్ద ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర సాయాన్ని కోరడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మామిడి రైతులకు భరోసా ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తోతాపురి మామిడి రైతులకు అదనపు ఊరటనిచ్చేలా.. రాష్ట్ర ప్రభుత్వం తరపున కిలో మామిడికి అదనంగా రూ.4 చొప్పున చెల్లించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తోతాపురి మామిడి రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరనుంది.








