మా ఇంటి బంగారం 2.. కథ ఎటు మలుపు తిరుగుతుంది?
సమంత(samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) సక్సెస్ తో ఇప్పుడందరి దృష్టి దాని సీక్వెల్‌పై పడింది. తాజాగా డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru) పార్ట్ 2 స్టోరీ లైన్ ఇప్పటికే రెడీగా ఉందని, దాదాపు రెండేళ్ల తర్వాత అదే టీమ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో కొత్త ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం సమంత వ్యక్తిగత కారణాలతో సినిమాలకు విరామం తీసుకోనున్న నేపథ్యంలో ఈ సినిమా వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం కనిపించడం లేదు.
అయితే పార్ట్2పై ఇప్పుడు ప్రధాన చర్చ కథ గురించే. ఎందుకంటే తొలి భాగంలో ప్రధాన పాత్రల ప్రయాణానికి పూర్తి స్థాయి ముగింపు లభించింది. అలాంటి కథను మళ్లీ ఎలా కొనసాగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తిగా కొత్త కాన్ఫ్లిక్ట్తో కథను ముందుకు తీసుకెళ్తారా? లేక మొదటి భాగంలో చూపించని మరో కోణాన్ని వెలికి తీస్తారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి.
మరోవైపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల అభిరుచి, మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటాయన్నది కూడా ఈ సీక్వెల్‌కు కీలకం కానుంది. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా బలమైన కథ, కొత్త ట్రీట్మెంట్తో వస్తేనే మా ఇంటి బంగారం2 పై ఏర్పడిన అంచనాలను అందుకోవడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం రాజ్ నిడిమోరు కామెంట్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని మరింత పెంచాయి.








