తెలంగాణ సరిహద్దుల్లో పెద్దపులి కలకలం..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పెద్దపులి(Tiger) సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఏపీలోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం అటవీ ప్రాంతం నుంచి బయలుదేరిన ఈ పులి.. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పరిధిలోని కావిడగుళ్ల, కంట్లం గ్రామాలకు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ఈ పెద్దపులి కదలికలను అధికారులు అత్యాధునిక సాంకేతికతతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
పులి మెడకు అమర్చిన ‘రేడియో కాలర్’ (Radio Caller) నుంచి వస్తున్న సిగ్నల్స్ ఆధారంగా అది ప్రస్తుతం ఎక్కడ ఉందనే విషయాన్ని అటవీ అధికారులు గుర్తించారు. పులి అశ్వరావుపేట వైపు అడుగులు వేయడంతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ అటవీ సిబ్బంది సంయుక్తంగా అలర్ట్ అయ్యారు. పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతాల ప్రజలు, పశువుల కాపరులు అడవి వైపు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. జనావాసాలకు దగ్గరగా వస్తున్న ఈ పెద్దపులిని సురక్షితంగా మళ్లించేందుకు ఉన్నతాధికారులు వేగంగా చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రత్యేక వైల్డ్ లైఫ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. స్థానిక అటవీ సిబ్బందితో కలిసి ఈ స్పెషల్ టీమ్ పులి కదలికలను ట్రాక్ చేస్తోంది. నివాస ప్రాంతాల వైపు రాకుండా, ఆ పెద్దపులిని సురక్షితంగా తిరిగి పాపికొండలు జాతీయ వనంలోని దట్టమైన అడవుల్లోకి పంపించేందుకు ఈ బృందం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఈ మగ పెద్దపులికి అటవీ శాఖ అధికారులు ‘ఎక్స్ప్లోరర్’ అని పేరు పెట్టారు.
దీనిని గతంలో తూర్పుగోదావరి జిల్లా కూర్మాపురంలో మత్తుమందు ఇచ్చి పట్టుకుని, రేడియో కాలర్ అమర్చి పాపికొండల అడవుల్లో విడిచిపెట్టారు. జూన్ 24-25 తేదీల్లో ఈ పులి బుట్టాయగూడెం మండలంలోని నిమ్మలగూడెం, పాలకుంట చెరువు సమీపంలో రెండు ఆవులను వేటాడి చంపేసింది. అంతకుముందు జనవరిలోనే ఇది ఏకంగా 13 ఆవులను హతమార్చింది. బుట్టాయగూడెం దాటడానికి ముందు, దేవీపట్నం సరిహద్దుల్లోని నేలకోట అటవీ ప్రాంతంలో ఒక అడవి పందిని వేటాడి తిన్నట్లు అధికారులు గుర్తించారు.








