కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ‘ఏఐ లీడర్షిప్ సమ్మిట్-2026’
కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో ‘ఏఐ లీడర్షిప్ సమ్మిట్-2026’ ఘనంగా నిర్వహించారు. ఫిన్టెక్, ఇన్సూర్టెక్, రిటైల్ టెక్నాలజీ రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ), ఏఐ గవర్నెన్స్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ అంశాలపై ప్రముఖ బహుళజాతి సంస్థల సీనియర్ పరిశ్రమ నిపుణులు చర్చించారు. ఐఐటీ ఖరగ్పూర్ అలుమ్నీ అసోసియేషన్-హైదరాబాద్ చాప్టర్, ఆస్ట్రావియన్ ఏఐ సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ సదస్సు.. విద్యాసంస్థలు, పరిశ్రమలు, విధాన రూపకర్తల మధ్య పరస్పర చర్చలకు వేదికగా నిలిచింది.
ఈ సదస్సులో సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, సీనియర్ కార్పొరేట్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డెలాయిట్ కన్సల్టింగ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), బ్యాంక్ ఆఫ్ అమెరికా, థాట్వర్క్స్, నోవార్టిస్, జేపీ మోర్గాన్ చేజ్, సర్వే ఆఫ్ ఇండియా, బీహెచ్ఈఎల్, టెక్బుల్స్, డీప్ట్రాక్ ఏఐ, ఆప్టిఫిషియల్ ల్యాబ్స్, టావంట్, కోడ్రిక్స్ ఏఐ, ఆష్ల్యాండ్, సెరీన్ బిజినెస్ సొల్యూషన్స్, ఆప్ట్మైజ్ సిస్టమ్స్, కిట్స్ వరంగల్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ హైదరాబాద్ తదితర ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఏఐ గవర్నెన్స్ ద్వారా వ్యాపారాలు, ఆర్థిక సేవలు, వినియోగదారుల అనుభవాలు, డిజిటల్ ఆవిష్కరణల్లో వస్తున్న మార్పులపై వారు విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు ఇంజి. కోనేరు లక్ష్మణ్ హవీష్ మాట్లాడుతూ.. “కృత్రిమ మేధ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తూ కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. అయితే సాంకేతిక నైపుణ్యంతో పాటు బాధ్యతాయుత నాయకత్వం కూడా అంతే కీలకం. ఏఐ లీడర్షిప్ సమ్మిట్-2026 వంటి కార్యక్రమాల ద్వారా విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపగల ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, నైతిక విలువలతో కూడిన ఏఐ నాయకులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని తెలిపారు.
సదస్సులో కృత్రిమ మేధ కేవలం సాంకేతిక ఆవిష్కరణ మాత్రమే కాకుండా ఆర్థికాభివృద్ధి, విద్యా సంస్కరణలు, బాధ్యతాయుత పాలన, శాస్త్రీయ పురోగతికి కీలక శక్తిగా మారిందని వక్తలు పేర్కొన్నారు. బాధ్యతాయుత ఏఐ (రెస్పాన్సిబుల్ ఏఐ), ఏఐ గవర్నెన్స్, మానవ పర్యవేక్షణ, పరిశ్రమ-విద్యాసంస్థల భాగస్వామ్యం ద్వారా మాత్రమే ఏఐని నైతికంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగించవచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ ఉద్యోగావకాశాలకు విద్యార్థులను సిద్ధం చేయాలంటే సంప్రదాయ బోధన విధానాలకు బదులుగా ఏఐ ఆధారిత, ప్రాజెక్టు కేంద్రిత, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన విద్యను విశ్వవిద్యాలయాలు అందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
ఏఐ ఆధారిత ఆర్థిక సేవలు, స్మార్ట్ బ్యాంకింగ్ వ్యవస్థలు, మోసాల గుర్తింపు, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, బీమా రంగంలో ఆవిష్కరణలు, వినియోగదారుల కేంద్రిత రిటైల్ టెక్నాలజీలు, సంస్థల్లో ఏఐ వినియోగం, స్టార్టప్లకు అవకాశాలు, భవిష్యత్ నిపుణులకు అందుబాటులో ఉన్న అవకాశాలతో పాటు నైతిక, బాధ్యతాయుత ఏఐ నియంత్రణకు సంబంధించిన విధానాలపై వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్యానెల్ చర్చలు, నెట్వర్కింగ్ సెషన్లు వివిధ రంగాల్లో ఏఐ వినియోగ అవకాశాలు, పరిశ్రమల భాగస్వామ్యం, విజ్ఞాన మార్పిడికి దోహదపడ్డాయి.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రో వైస్ ఛాన్సలర్ డా. ఎన్. వెంకట్రామ్, స్కిల్లింగ్ డీన్ డా. శ్రీనాథ్, కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ డీన్ డా. ఆనంద్ బెతపూడి, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు, సిబ్బంది పాల్గొన్నారు.
సదస్సు ముగింపులో పరిశ్రమలు-విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసి ఆవిష్కరణలు, పరిశోధనలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేయాలని సంకల్పించారు. కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో బోధన, పరిశోధన, సంస్థాగత వ్యూహాల్లో కృత్రిమ మేధను సమగ్రంగా అనుసంధానించడం, అంతరశాఖ సహకారాన్ని ప్రోత్సహించడం, పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని విస్తరించడం, నైతిక ఏఐ వినియోగం, ఏఐ అవగాహన పెంపొందించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో రాణించగల నాయకత్వ లక్షణాలు కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.








