పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ధన్యవాదాలు : ప్రధాని మోదీ
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.135వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇతర పొదుపు చర్యలను ప్రజలు చేపట్టారని మోదీ అన్నారు. అనేక మంది తమ విదేశీ టూర్లను వాయిదా వేసుకున్నారని చెప్పారు. ప్రపంచస్థాయి సంక్షోభాన్ని భారతీయులు కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.
స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇప్పటికే అనేక మైలురాళ్లను చేరుకుందని కూడా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశీయంగా తయారైన తొలి సీ-295 విమానం కార్యకలాపాలు ప్రారంభం కావడం ఇందుకు నిదర్శనమని అన్నారు. భారత ఎయిరోస్పేస్ రంగం బలోపేతానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. సీ-295 విమానంతో పాటు మరో 40 విమానాలు దేశంలో తయారవుతున్నాయని చెప్పారు. ఇది చిన్న మధ్యస్థాయి పరిశ్రమలను కూడా బలోపేతం చేస్తోందని చెప్పారు. కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.
అలాగే యువత క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో నాగాలాండ్ స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఆ రాష్ట్రంలో నాగాలాండ్ బేబీ లీగ్ నడుస్తోందని, 517:42 28-06-2026 నుంచి 12 ఏళ్ల మధ్య వయసులో వున్న చిన్నారుల్లో స్ఫూర్తి నింపి, వారు క్రీడల వైపు మొగ్గు చూపేలా చేస్తోందన్నారు. అదే విధంగా నాగాలాండ్ లో విమెన్ ఫుట్ సల్ లీగ్ ను కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఫుట్ సల్ పదం చాలా మందికి కొత్తగా అనిపిస్తోందని, ఆడబిడ్డల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఇది వేదిక అని అన్నారు.
పర్యావరణ పరిరక్షణలో కూడా పురోగతి సాధిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. పర్యావరణ రక్షణకు కీలకమైన హరిగిలా పక్షిపై కొందరు అస్సాం ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు విశేష కృషి చేసిన జీవశాస్త్రవేత్త పూర్ణిమా దేవి బర్మన్ను కూడా అభినందించారు. ఒకప్పుడు ఆ పక్షిని అపశకునంగా భావించిన వారే నేడు దాని కోసం సంరక్షణ చర్యలు చేపడుతున్నారని అన్నారు.








