విజయ్ ప్రభుత్వానికి ముప్పు? కూల్చేందుకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్..
తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొన్ని రోజుల క్రిందటే గద్దెనెక్కి, సంచలనం రేపిన విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీని కూల్చేందుకు కుట్రలు అప్పుడే ప్రారంభం అయ్యాయి. ఇవేవో విమర్శలు కూడా పక్కాగా ఆధారాలు కూడా దొరకడంతో సంచలనం రేగుతోంది. టీవీకే పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి, లొంగతీసుకునేందుకు కొందరు వ్యక్తులు తెర వెనుక పెద్ద ఎత్తున కుట్రలు చేసినట్లు ఆధారాలు లభించాయి.
ఈ వ్యవహారంలో ఓ పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడితో పాుట మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం కుట్ర వెనుక డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం వుందని పలు ఆరోపణలు వస్తున్నాయి.ఈ వ్యవహారంలో సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్ సహా మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముగ్గురు వ్యక్తులు కుట్రలు పన్నారని టీవీకే ఎమ్మెల్యే ఇలయ రాజా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. టీవీకే నేత తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పై అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని ఇండియన్ పొలిటికల్ డెమోక్రెటిక్ స్ట్రాటజీస్ కన్సల్టెన్సీకి చెందిన తిరునావుక్కరసు అనే వ్యక్తి తనను కోరారని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు తనకు 35 కోట్లు కూడా ఇవ్వజూపారని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఈ వ్యవహారంపై తమిళనాడు మంత్రి సీటీ నిర్మల్ కుమార్ స్పందించారు. సెంథిల్ బాలాజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. ‘సెంథిల్ బాలాజీతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులు ఈ వ్యవహారంలో నేరుగా పాలుపంచుకున్నారు. వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కుట్రలో భాగం అయిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలి. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ముగింపు పలకాలి’ అని అన్నారు.








