Jagga Reddy: జగ్గారెడ్డికి పీసీసీ… సాధ్యమేనా..?
తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిణామాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. టీపీసీసీ (TPCC) అధ్యక్ష పదవికి జగ్గారెడ్డి సరైన అభ్యర్థి అని, ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. “జగ్గారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలి. ఆయన ఒక మాస్ లీడర్. ప్రజల్లో ఉంటూ, ప్రజల కష్టాలను తీర్చే నాయకుడు” అని ఆయన పేర్కొన్నారు. కేవలం కోమటిరెడ్డే కాకుండా, మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గతంలో జగ్గారెడ్డిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.
జగ్గారెడ్డిని కోమటిరెడ్డి ‘మరో పీజేఆర్’ అని అభివర్ణించారు. హైదరాబాద్ రాజకీయాల్లో పీజేఆర్ ఎలాగైతే పేదల పెన్నిధిగా పేరు తెచ్చుకున్నారో, జగ్గారెడ్డి కూడా అదే తరహాలో ఆపదలో ఉన్నవారికి తక్షణమే స్పందిస్తారని కోమటిరెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండేవారికి ప్రజలతో మమేకమయ్యే గుణం ఉండాలని, అది జగ్గారెడ్డిలో పుష్కలంగా ఉందని ఆయన వాదన.
జగ్గారెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా 100 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కేడర్‌ను ఉత్సాహపరచడంలో, ప్రత్యర్థులపై గట్టిగా విరుచుకుపడటంలో జగ్గారెడ్డికి ప్రత్యేక శైలి ఉంది. ఈ దూకుడు స్వభావం పార్టీకి క్షేత్రస్థాయిలో మేలు చేస్తుందని సీనియర్ నేతలు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు కొత్తేమీ కాదు. అయితే, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి ఉద్ధండులు జగ్గారెడ్డి పేరును ప్రతిపాదించడం వెనుక ఒక వ్యూహం కనిపిస్తోంది. సీనియర్లందరినీ కలుపుకుని పోయే సత్తా, అదే సమయంలో అధిష్టానం వద్ద గట్టిగా మాట్లాడగలిగే చొరవ జగ్గారెడ్డికి ఉన్నాయని వారు నమ్ముతున్నారు.
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అనేది పూర్తిగా ఏఐసీసీ (AICC) పరిధిలోని అంశం. పైగా ఇటీవలే మహేశ్ కుమార్ గౌడ్ కు పీసీసీ పగ్గాలు అప్పగించింది అధిష్టానం. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే వరకూ పీసీసీ పీఠం రేవంత్ రెడ్డి దగ్గర ఉండేది. ఆ తర్వాత మహేశ్ గౌడ్ కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పీసీసీని మారుస్తారని ఆశించడం అత్యాసే అవుతుంది. అయితే కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు జగ్గారెడ్డి కోసం ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వరకూ ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించారు జగ్గారెడ్డి. ఆయనపై ఎన్నోసార్లు నేరుగా విమర్శలు కూడా గుప్పించారు. అలాంటి వ్యక్తికి రేవంత్ రెడ్డి సీఎంగా ఉండగా పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారా అనేది అనుమానమే.
పైగా సీఎం సీట్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నప్పుడు, పీసీసీని మరో రెడ్డి ఇస్తారని ఆశించడం కూడా అత్యాశే. కాబట్టి ఇప్పటికిప్పుడు పీసీసీలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కాలం కలిసొస్తే జగ్గారెడ్డికి ఎమ్మెల్సీ లేదా సలహాదారు పదవి లాంటివి ఇవ్వొచ్చేమో కానీ పీసీసీ మాత్రం దక్కకపోవచ్చు.
మొత్తానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరలేపాయి. జగ్గారెడ్డిని ‘మానవత్వం ఉన్న మనిషి’గా, ‘ధైర్యవంతుడైన నాయకుడి’గా చిత్రించడం ద్వారా ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్‌ను కోమటిరెడ్డి బలంగా వినిపించారు. అయితే.. ఇప్పట్లో ఆయన కోరిక నెరవేరకపోవచ్చు.
ఇవి కూడా చదవండి








