AIతో కోర్టు కేసులు పెరుగుతాయా? వినడానికి షాక్… కానీ లాజిక్ ఇదే!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
మీ భూమిని ఎవరైనా కొద్దికొద్దిగా ఆక్రమిస్తున్నారని తెలిసింది.
కోర్టుకు వెళ్దామనుకున్నారు. సమర్దుడైన లాయర్ ని పెట్టుకుందామనుకున్నారు. అందుకు తగినట్లుగా మీ దగ్గర అన్ని పత్రాలూ ఉన్నాయి. కానీ…మిమ్మల్ని ఒకటే వెనక్కి లాగేస్తోంది. అదే “లాయర్ ఫీజులు… కోర్టు ఖర్చులు… ఏళ్ల తరబడి కేసు…”. ఇలా భయపడే చాలా మంది కోట్లు మెట్లు ఎక్కటానికి భయపడతారు. వెనక్కి తగ్గిపోతారు.
కానీ… రేపన్నరోజు AI మీ పత్రాలు చదివి, నిమిషాల్లో లీగల్ నోటీసు డ్రాఫ్ట్ చేసి, తర్వాత ఏం చేయాలో కూడా సూచిస్తే? ఇప్పటివరకు కోర్టు ముఖం చూడని వాళ్లు కూడా కేసు వేయడానికి ముందుకు వస్తారా?
ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద లా ఫర్మ్లను ఆలోచింపజేస్తోంది. ఎందుకంటే AI వల్ల లాయర్ల ఉద్యోగాలు పోవడం కాదు… కోర్టు కేసుల సంఖ్యే పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అసలు సమస్య లాయర్లు కాదు… ఖర్చు
మన దేశంలో భూమి వివాదాలు, అద్దె గొడవలు, చెక్ బౌన్స్ కేసులు, చిన్న వ్యాపార ఒప్పందాల సమస్యలు… ఇలా ఎన్నో లీగల్ వివాదాలు ఉన్నాయి. అయినా చాలామంది కోర్టుకు వెళ్లరు. కారణం ఒక్కటే… న్యాయం కంటే… న్యాయం కోసం అయ్యే ఖర్చే ఎక్కువ అనిపిస్తుంది.
AI వల్ల లీగల్ డాక్యుమెంట్లు తయారు చేయడం, పాత కేసుల వివరాలు వెతకడం, ఒప్పందాలు పరిశీలించడం వంటి పనులు వేగంగా జరిగితే… న్యాయ సేవలు మరింత అందుబాటులోకి రావచ్చు. దాంతో ఇప్పటివరకు వెనక్కి తగ్గిన వాళ్లు కూడా కోర్టు బాట పట్టే అవకాశం ఉంది.
చరిత్ర ఏం చెబుతోంది?
టెక్నాలజీ వచ్చినప్పుడల్లా ఉద్యోగాలు పోతాయని అంటారు. కానీ చాలా సందర్భాల్లో కొత్త అవకాశాలే పెరిగాయి. Google Maps వచ్చిన తర్వాత డ్రైవర్లు తగ్గలేదు. ట్రావెల్, టాక్సీలు, డెలివరీలు పెరిగాయి.
ఆన్లైన్లో IT రిటర్న్స్ వేయడం సులభమైన తర్వాత CAలు మాయమవ్వలేదు. వాళ్లు మరింత క్లిష్టమైన సేవలపై దృష్టి పెట్టారు.
లాయర్ల విషయంలో కూడా ఇలాగే జరగొచ్చు.
AI లాయర్ కాదు… సహాయకుడు మాత్రమే. AI డాక్యుమెంట్లు సిద్ధం చేయగలదు. పాత తీర్పులు వెతకగలదు. లీగల్ డ్రాఫ్ట్స్ రాయగలదు. కానీ కోర్టులో వాదించలేదు. బాధ్యత తీసుకోలేదు. అందుకే లాయర్ల పని పోదు. వాళ్లు సమయాన్ని కాదు… తమ అనుభవాన్ని, వ్యూహాన్ని అమ్మే రోజులు మొదలవుతాయి.
కానీ మరో ప్రమాదం కూడా ఉంది
AI వల్ల నిజమైన కేసులతో పాటు తప్పుడు లీగల్ నోటీసులు, ఆధారంలేని కేసులు కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఇది కోర్టులపై మరింత భారం పెంచే అవకాశం ఉంది.
ముగింపు
ఒకప్పుడు న్యాయం ఖరీదైనది. అందుకే అన్యాయం జరిగినా చాలామంది మౌనంగా ఉండిపోయారు. AI నిజంగానే న్యాయ సేవలను చౌకగా, వేగంగా అందుబాటులోకి తీసుకురాగలిగితే… ప్రజలు తమ హక్కుల కోసం మరింత ధైర్యంగా ముందుకు రావచ్చు.
అందుకే రేపటి పెద్ద ప్రశ్న…
“AI లాయర్ల పని పోగుడుతుందా?” అంటే కాదు.
“AI వల్ల ఇప్పటివరకు కేసు వేయలేకపోయిన లక్షల మంది… ఇక కోర్టు తలుపు తడతారా?” అనేదే.








