మీకు ‘సిక్స్ సెన్స్’ ఉంది..! నమ్మరా? శాస్త్రవేత్తలు చెబుతున్న కొత్త నిజం ఇదే!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
అతను రోడ్డుపై నడుస్తున్నాడు.
ఒక్కసారిగా అడుగులు ఆపేశాడు.
వెనక్కి తిరిగి చూశాడు.
అక్కడ ఎవరూ లేరు.
కానీ…
కొన్ని క్షణాల తర్వాత అదే చోట భారీ ప్రమాదం జరిగింది.
ఆ సీన్ ముగిసిన వెంటనే…
సినిమా చూస్తున్న మనకు వెంటనే ఒక మాట గుర్తొస్తుంది. “సిక్స్ సెన్స్.” భవిష్యత్తును ముందే పసిగట్టే శక్తి.
ప్రమాదాన్ని ముందే ఊహించే సామర్థ్యం.
అందుకే…
“సిక్స్ సెన్స్ నిజ జీవితంలో ఉండదు” అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు.
వారి ప్రకారం… మనిషికి తెలిసిన ఐదు ఇంద్రియాలతో పాటు, తన శరీరం లోపల జరిగే మార్పులను గుర్తించే మరో ప్రత్యేకమైన సామర్థ్యం కూడా ఉంది. అదే కొందరు పరిశోధకులు “సిక్స్ సెన్స్”తో పోలుస్తున్నారు. ఇది భవిష్యత్తును చెప్పే శక్తి కాదు. మన శరీరం ప్రతి క్షణం పంపే సంకేతాలను వినిపించే సహజ వ్యవస్థ.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ వ్యవస్థను మనం రోజుకు ఎన్నోసార్లు ఉపయోగిస్తున్నా, దాని గురించి చాలా మందికి తెలియదు.
ఇవి కూడా చదవండి
ఒక్కసారి మీ రోజువారీ జీవితాన్ని గుర్తు చేసుకోండి.
ముఖ్యమైన ఇంటర్వ్యూకి వెళ్లే ముందు అరచేతులు చెమటలు పట్టడం…
పరీక్ష హాల్లోకి అడుగుపెట్టే ముందు కడుపులో ఏదో తిప్పినట్టు అనిపించడం…
అపరిచిత నంబర్ నుంచి ఫోన్ రాగానే గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం…
ఇంట్లో గొడవ జరిగిన తర్వాత ఆకలి పూర్తిగా మాయమవడం…
మన తెలుగు ఇళ్లలో తరచూ వినిపించే ఓ మాట గుర్తు చేసుకుందాం. “ఎందుకో ఈరోజు గుండెలో గుబులుగా ఉంది.” మనం వీటిని టెన్షన్, అలసట లేదా మూడ్గా తీసుకుని ముందుకు వెళ్లిపోతాం. కానీ… ఇవి కేవలం భావోద్వేగాలు మాత్రమే కాకపోవచ్చు. మీ శరీరం పంపుతున్న సంకేతాలు కూడా కావచ్చు.
మనం ప్రతిరోజూ మొబైల్లో వచ్చే ప్రతి నోటిఫికేషన్ను గమనిస్తాం.
బ్యాంక్ మెసేజ్…
వాట్సాప్…
UPI…
సోషల్ మీడియా…
ఏది వచ్చినా వెంటనే ఫోన్ చూస్తాం. కానీ మన జీవితంలో అత్యంత ముఖ్యమైన నోటిఫికేషన్లు మాత్రం మొబైల్ నుంచి రావు. అవి మన శరీరం నుంచి వస్తాయి.
దాహం వేయడం అంటే నీళ్లు కావాలని శరీరం చెబుతోంది.
ఆకలి వేయడం అంటే శక్తి కావాలని చెబుతోంది.
గుండె వేగంగా కొట్టుకోవడం అంటే శరీరం అప్రమత్తమవుతోందని చెబుతోంది.
ఊపిరి మారడం అంటే లోపల ఏదో పరిస్థితి మారుతోందని తెలియజేస్తోంది.
సమస్య ఒక్కటే… ఈ భాషను మనం పెద్దగా వినడం నేర్చుకోలేదు. ఈ సామర్థ్యాన్నే శాస్త్రవేత్తలు Interception అంటారు. తెలుగులో చెప్పాలంటే… “అంతర్గత శరీర అవగాహన.” అంటే మన శరీరంలో జరుగుతున్న లోపలి మార్పులను గుర్తించి, వాటి గురించి మెదడుకు సమాచారం అందించే వ్యవస్థ.
గుండె స్పందన…శ్వాస…ఆకలి… దాహం…శరీర ఉష్ణోగ్రత…కండరాల ఒత్తిడి…ఇవన్నీ ఈ వ్యవస్థ నిరంతరం గమనిస్తూ ఉంటుంది. అందుకే దాహం వేస్తే మనం నీళ్లు తాగుతాం. వేడి ఎక్కువైతే నీడలోకి వెళ్తాం. చలి వేస్తే దుప్పటి కప్పుకుంటాం. ఇవి చిన్న విషయాల్లా కనిపించినా… మనిషి బతకడానికి అత్యంత అవసరమైన జీవ వ్యవస్థలో భాగం.
దీని ప్రాముఖ్యత ప్రమాద సమయాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా ఎదురుగా వేగంగా ఒక బైక్ వచ్చిందనుకోండి. ఆలోచించేలోపే గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస వేగం పెరుగుతుంది. కండరాలు బిగుసుకుంటాయి. ఇది మీరు తీసుకున్న నిర్ణయం కాదు. మీ శరీరం తీసుకున్న నిర్ణయం.
శాస్త్రవేత్తలు దీనినే Fight or Flight Response అంటారు. అంటే ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే శరీరం తనను తాను రక్షించుకునే సహజ ప్రతిస్పందన.
ఇప్పుడు పరిశోధకులను ఎక్కువగా ఆకర్షిస్తున్న ప్రశ్న ఇంకొకటి.
ఈ శరీర సంకేతాలను సరిగ్గా గుర్తించడం లేదా అర్థం చేసుకోవడంలో తేడాలు ఉంటే… అది మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందా? తాజా పరిశోధనలు అదే దిశగా సాగుతున్నాయి.
యాంగ్జైటీ, డిప్రెషన్, PTSD, కొన్ని ఈటింగ్ డిజార్డర్స్తో ఈ వ్యవస్థకు సంబంధం ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఉదాహరణకు… నలుగురిలో మాట్లాడే ముందు గుండె వేగంగా కొట్టుకోవడం సహజం. కానీ యాంగ్జైటీ ఉన్న వ్యక్తి అదే సంకేతాన్ని పెద్ద ప్రమాదంగా అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచే భయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
రాయల్ హాలోవే యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు 93 అధ్యయనాలను విశ్లేషించారు. మహిళల్లో ఈ అంతర్గత శరీర సంకేతాలను గుర్తించే విధానంలో కొన్ని తేడాలు కనిపించాయని వారు గుర్తించారు. యుక్తవయసు తర్వాత మహిళల్లో యాంగ్జైటీ, డిప్రెషన్ ఎక్కువగా కనిపించడానికి దీనికీ సంబంధం ఉండవచ్చా అనే అంశంపై ప్రస్తుతం మరిన్ని అధ్యయనాలు కొనసాగుతున్నాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన నిర్ధారణకు శాస్త్రవేత్తలు రాలేదు.
UCLA పరిశోధకులు అనోరెక్సియా బాధితులపై చేసిన అధ్యయనం కూడా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు వీరు ఆకలిని కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని భావించేవారు. కానీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం… వారి నరాల వ్యవస్థ ఆకలి సంకేతాలను భిన్నంగా ప్రాసెస్ చేయడం వల్ల వాటిని గుర్తించడం, నమ్మడం కష్టమవుతుండొచ్చు. అందుకే చికిత్స తర్వాత బరువు తగ్గినా, సమస్య వెంటనే పూర్తిగా తగ్గిపోవడం లేదని వారు భావిస్తున్నారు.
అయితే ఈ కథకు మరో కోణం కూడా ఉంది.
Interoception అనే భావనపై అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం… శరీరంలో జరిగే అనేక సంక్లిష్ట ప్రక్రియలను ఒకే పదంలో చెప్పడం వల్ల అసలు విషయం మరీ సరళీకృతమవుతోంది. మరికొందరు మనిషికి ఐదు కాదు, ఇంకా చాలా రకాల ఇంద్రియాలు ఉండొచ్చని కూడా వాదిస్తున్నారు. అంటే… ఈ రంగంలో ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. అయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
మన శరీరం మనం అనుకున్నదానికంటే చాలా ఎక్కువ సమాచారాన్ని ప్రతి క్షణం సేకరిస్తోంది. కొన్ని ప్రారంభ అధ్యయనాలు ధ్యానం, యోగా, లోతైన శ్వాస వంటి సాధనలు ఈ సంకేతాలపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడవచ్చని సూచిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ముగింపు
సిక్స్ సెన్స్ గురించి మన ఊహలు ఇప్పటికీ సినిమాల చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ శాస్త్రవేత్తలు వెతుకుతున్న “సిక్స్ సెన్స్” మాత్రం రహస్యమైన శక్తి కాదు. అది ప్రతిరోజూ మీలో పనిచేసే ఒక నిశ్శబ్ద వ్యవస్థ.
మీ గుండె చప్పుడులో…
మీ శ్వాసలో…
మీ ఆకలిలో…
మీకు తెలియని ఆ చిన్న గుబులులో… ఆ వ్యవస్థ తన పని చేస్తూనే ఉంటుంది.
బహుశా…
సిక్స్ సెన్స్ అంటే భవిష్యత్తులోకి చూడటం కాదు… మన శరీరంలోపలికి చూడటం. మన శరీరం వర్తమానంలో చెబుతున్న మాటను వినగలగడమే కావచ్చు.








