గ్రేటర్ హైదరాబాద్ కోసం కేటీఆర్ సీక్రెట్ ఆపరేషన్..!
లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ మారిన సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలపైనే పడ్డాయి. ఈ ఏడాది చివర్లో రాబోయే ఈ ఎన్నికలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్‌ను పార్టీకి కవచంగా, బలమైన కోటగా నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తెరవెనుక నగరంలో ఒక భారీ ‘వార్ రూమ్’ రన్ అవుతున్నట్లు సమాచారం. అందులో నుంచే వ్యూహాత్మక ఆపరేషన్లు నడుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలకోసం కేటీఆర్ కేవలం బహిరంగ సభలు, ప్రచారాలకే పరిమితం కావడం లేదు. క్షేత్రస్థాయిలో మైక్రో-లెవెల్ ప్లానింగ్‌పై పూర్తి దృష్టి పెట్టారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి డివిజన్ వారీగా ఓట్ల మార్పిడి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అక్రమంగా ఓట్లను తొలగించకుండా ఉండేందుకు బూత్ లెవెల్ ఏజెంట్లను అలర్ట్ చేశారు. నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ ఇన్చార్జులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో నిరంతరం టచ్‌లో ఉంటూ వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు ప్రతి విషయంలోనూ డేటా ఆధారిత వ్యూహాలతో, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకూడదనే సంకల్పంతో కేటీఆర్ ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరకముందు, హైదరాబాద్ నగరంలో గులాబీ పార్టీకి అసలు ఉనికి ఉండేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనుకాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మలి దశ ఉద్యమం, ఆ తర్వాత పదేళ్ల అధికార కాలంలో ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడం ద్వారా బీఆర్ఎస్ ఇక్కడ తిరుగులేని పట్టు సాధించింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లోని సీమాంధ్రులు కూడా బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం లేనప్పటికీ.. నగర ప్రజలు ఇప్పటికీ తమవైపే ఉన్నారని, తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అగ్నిపరీక్ష కేటీఆర్ ముందుంది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికల్లో గెలవడం బీఆర్ఎస్ మనుగడకు ఎంత అవసరమో కేటీఆర్‌కు బాగా తెలుసు. ఒకవేళ ఇక్కడ గనుక పట్టు కోల్పోతే, పార్టీ కేడర్ నైరశ్యంలోకి వెళ్లడమే కాకుండా వలసల తీవ్రత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికలను ‘డూ ఆర్ డై’ బ్యాటిల్‌గా భావించి ఆయన రంగంలోకి దిగారు. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. కార్పొరేటర్ టికెట్లు ఆశించే వారు ఏసీ రూమ్ లకే పరిమితం కాకుండా, ప్రజల్లోనే ఉంటూ పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
ఈ ఏడాది చివర్లో ఎలాగైనా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడింది తామేనని నిరూపించడమే కేటీఆర్ ఏకైక లక్ష్యం. ఇందుకోసం ఓటర్ల నమోదు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు ప్రతి విషయంలోనూ డేటా ఆధారిత వ్యూహాలతో దూసుకుపోతున్నారు. కేటీఆర్ నడుపుతున్న ఈ నిశ్శబ్ద యుద్ధం, క్షేత్రస్థాయి వ్యూహాలు గ్రేటర్ రాజకీయాల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో, కాంగ్రెస్ స్పీడ్‌కు ఎలా బ్రేకులు వేస్తాయో చూడాలి.








