కూటమికి లోకల్ అంత ఈజీ కాదా..? జగన్ మొండితనం..!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతుండటంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాబోయే సెప్టెంబర్ చివరి వారంలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ అప్పుడే వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) స్థానిక ఎన్నికలపై ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ స్థానాన్ని వదలకుండా ప్రతి చోటా కచ్చితంగా పార్టీ అభ్యర్థి పోటీలో ఉండాల్సిందేనని ఆయన కేడర్‌కు తేల్చి చెప్పారు.
ఒకవేళ ఏ నియోజకవర్గంలోనైనా అభ్యర్థి పోటీలో లేకపోతే, దానికి పూర్తి బాధ్యత వహిస్తూ సదరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌పై కఠిన నిర్ణయాలు ఉంటాయని జగన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే అధికార పార్టీకి అనుకూలంగా ఏకగ్రీవాలు ఎక్కువగా జరగడం మన రాష్ట్రంలో చూస్తుంటాం. కానీ, ఈసారి ఏ ఒక్క స్థానాన్ని కూడా అధికార కూటమికి ఏకగ్రీవంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కూటమి నేతలకు పెద్ద తలనొప్పిగా మారింది.
ప్రతి వార్డు, ప్రతి పంచాయతీ మరియు ప్రతి ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వనుండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ప్రతి సీటు కోసం క్షేత్రస్థాయిలో తీవ్రంగా కష్టపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నాం కాబట్టి సులువుగా గెలిచేయవచ్చని భావించిన కూటమి నేతలకు జగన్ తీసుకున్న ఈ దూకుడు వ్యూహం గట్టి సవాలు విసిరినట్లయింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికలోనూ జగన్ సరికొత్త టాస్క్ విధించారు. గత కొన్ని రోజులుగా పార్టీ కోసం నిజాయితీగా పని చేసిన వారికే సీట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసారు.
అప్పుడే కేడర్‌లో నూతనోత్సాహం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల కార్యాచరణ మరియు అభ్యర్థుల ఎంపికపై మరింత స్పష్టత ఇచ్చేందుకు ఈ నెల 22వ తేదీన వైఎస్ జగన్ పార్టీ ముఖ్య నేతలతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత వైసీపీ క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లడానికి పక్కా రోడ్ మ్యాప్‌తో సిద్ధం కానుంది. జగన్ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులతో ఏపీలో స్థానిక పోరు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారబోతోంది.








