వేస్ట్ అనుకునే తొక్కతోనే.. ఇలా ఆంధ్ర స్టైల్ తొక్కు పచ్చడి.. ఆ రుచే వేరు అసలు
ఇంట్లో బీరకాయ కూర చేసేటప్పుడు తొక్కను చాలామంది సాధారణంగా తీసి పడేస్తుంటారు. కానీ ఆ తొక్కతోనే రుచికరమైన ఆంధ్ర స్టైల్ బీరకాయ తొక్కు పచ్చడి తయారు చేసుకోవచ్చు. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. తక్కువ పదార్థాలతో, సులభంగా తయారయ్యే ఈ పచ్చడి భోజనానికి మంచి రుచిని తీసుకొస్తుంది. ఒక్కసారి రుచి చూస్తే బీరకాయ తొక్కను ఇకపై పడేయాలనిపించదు.
బీరకాయ తొక్కను ఇలా సిద్ధం చేయండి

ముందుగా బీరకాయలను నీటితో బాగా కడిగి, పైభాగంలోని గట్టిగా ఉండే రేఖలను తొలగించాలి. తర్వాత తొక్కను తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి మరోసారి శుభ్రంగా కడగాలి.
పచ్చడికి లేత బీరకాయ తొక్క అయితే రుచి, మెత్తదనం బాగుంటాయి. చాలా ముదిరిన బీరకాయల తొక్క గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి లేత కాయలను ఎంచుకోవడం మంచిది.
పచ్చడికి కావాల్సిన పదార్థాలు

బీరకాయ తొక్కలు – 2 కప్పులు, పచ్చిమిర్చి – 2, ఎండు మిర్చి – 2–3, మినపప్పు – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర – 1 టీ స్పూన్, చింతపండు – చిన్న ముక్క, ఉప్పు, పసుపు, నూనె సరిపడా తీసుకోవాలి.
తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ కొద్దిగా సిద్ధంగా ఉంచుకోవాలి. మీకు నచ్చితే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు.
పచ్చడి తయారీ విధానం

ముందుగా పాన్లో కొద్దిగా నూనె వేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయలను వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్లో బీరకాయ తొక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి.
వేయించిన పదార్థాలు చల్లారిన తర్వాత ముందుగా పప్పులు, మిరపకాయలను కొద్దిగా పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయ తొక్కలు, చింతపండు, ఉప్పు వేసి అవసరమైనంత నీటితో కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
తాలింపు వేస్తే రుచి మరింత పెరుగుతుంది

చివరగా చిన్న పాన్లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టాలి. ఈ తాలింపును పచ్చడిపై వేసి బాగా కలిపితే సువాసనతో కూడిన బీరకాయ తొక్కు పచ్చడి సిద్ధమవుతుంది.
వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలిపి తింటే రుచి అదిరిపోతుంది. ఇడ్లీ, దోస, చపాతీతో సైడ్డిష్గా కూడా వడ్డించుకోవచ్చు.








