CSK తదుపరి హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ కోచింగ్ స్టాఫ్‌లో ఒక భారీ మార్పుకు శ్రీకారం చుట్టబోతోందా అంటే అవుననే అంటున్నాయి తాజా సమీకరణాలు. సీఎస్కే ప్రస్తుత హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో ఇంగ్లాండ్ మాజీ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఒక సంచలన విషయాన్ని వెల్లడించాడు. మోర్గాన్ నియామకానికి సంబంధించిన అధికారిక నిర్ణయం వచ్చే వారం రోజుల్లోనే వెలువడే అవకాశం ఉందని అశ్విన్ తెలిపాడు.
ఇయాన్ మోర్గాన్‌కు హెడ్ కోచ్‌గా ఎలాంటి ముందస్తు అనుభవం లేనప్పటికీ, వైట్-బాల్ క్రికెట్లో అతనికున్న అపారమైన వ్యూహాత్మక చతురత తిరుగులేనిది. 2019 లో ఇంగ్లాండ్‌కు మొట్టమొదటి వన్డే ప్రపంచ కప్‌ను అందించిన మోర్గాన్, ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టును కెప్టెన్‌గా ఫైనల్స్ దాకా నడిపించాడు. అశ్విన్ అంచనా ప్రకారం, మోర్గాన్‌తో పాటు అతని నమ్మకస్థుడైన ప్రముఖ డేటా అనలిస్ట్ నాథన్ లీమన్ కూడా సీఎస్కే సపోర్ట్ స్టాఫ్‌లో చేరే ఛాన్స్ ఉంది.
అయితే, ఈ కోచింగ్ మార్పుల టైమింగ్‌పై అశ్విన్ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్‌ను తెరపైకి తెచ్చాడు. 2028 లో ఐపీఎల్ మెగా వేలం (Mega Auction) జరగనుండటంతో, దానికి ఒక ఏడాది ముందు అంటే 2027 ఐపీఎల్ సీజన్ వరకు ఎమ్మెస్ ధోనీ (MS Dhoni) స్వయంగా కోచింగ్ బాధ్యతలను భుజాన వేసుకునే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ టీమ్‌ను ముందుండి నడిపిస్తూ ఇతర సహాయక సిబ్బందితో పనులు పూర్తి చేయించడం ప్రస్తుతానికి అత్యుత్తమ ఎంపిక అని, ఆ తర్వాతే మోర్గాన్ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టవచ్చని అశ్విన్ తన వ్యక్తిగత విశ్లేషణను పంచుకున్నాడు. ఈ వార్తతో అటు చెన్నై ఫ్యాన్స్‌తో పాటు ఇటు క్రికెట్ వర్గాలలో సరికొత్త చర్చ ఊపందుకుంది.








