కర్నూలు జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత..!
కర్నూలు జిల్లా కేంద్ర జైలు పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) జైలు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా ఆంక్షలు విధించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జగన్‌ను చూసేందుకు మరియు ఆయనకు స్వాగతం పలికేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్కడికక్కడే అడ్డుకుని వెనక్కి పంపేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఈ తీరుపై వైప్యాసార్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
భద్రతా కారణాలను అడ్డుపెట్టుకుని కర్నూలు జైలు పరిసరాల్లో పోలీసులు అసాధారణ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జైలు ప్రధాన ద్వారం నుంచి దాదాపు ఒక కిలోమీటర్ దూరం వరకు ఎవరినీ అనుమతించేది లేదని స్పష్టం చేస్తూ నో-ఎంట్రీ జోన్‌గా ప్రకటించారు. అంతేకాకుండా, జైలుకు వెళ్లే రహదారుల వెంబడి ముళ్లకంచెలు (Barricades) ఏర్పాటు చేసి భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముందస్తు అనుమతి ఉన్న కొద్దిమంది నేతలను తప్ప సామాన్య కార్యకర్తలను, అభిమానులను జైలు దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే జైలు వద్ద విధుల్లో ఉన్న సీఐ తేజోమూర్తి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. నిబంధనల పేరుతో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులను సైతం ఆయన అడ్డుకున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి సతీమణికి చెందిన వాహనాన్ని జైలు పరిసరాల్లోకి అనుమతించకుండా సీఐ తేజోమూర్తి వెనక్కి పంపించివేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పట్ల కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి మరియు భయానక వాతావరణాన్ని సృష్టించడానికే ప్రభుత్వం పోలీసులను వాడుకుంటోందని ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.








