ఫిలడెల్ఫియాలో నటుడు రాజేంద్రప్రసాద్‌కి ఆత్మీయ సత్కారం
భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న ప్రముఖ నటుడు, నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు. పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్ ‘బ్రెయర్స్ స్టేషన్ క్లబ్ హౌస’లో రవి పొట్లూరి ఆధ్వర్యంలో జరిగిన వేడుకకు ప్రవాస తెలుగు ప్రజలు విశేష సంఖ్యలో హాజరయ్యారు. రాజేంద్రప్రసాద్ తన విలక్షణమైన నటనా ప్రతిభతో దాదాపు 49 సంవత్సరాలుగా చలనచిత్ర పరిశ్రమలో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారని తెలుగు సంఘాల ప్రతినిధులు, అభిమానులు కొనియాడారు. హాస్యరస చిత్రాలతో పాటు ఎన్నో ఉత్తమ పాత్రలతో మెప్పించిన ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డు రావడం తెలుగు జాతికే గర్వకారమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్టుకు రూ.8 లక్షల విరాళం అందించారు. అనంతరం శాలువాలు, జ్ఞాపికలతో ఆయన్ను ఘనంగా సన్మానించారు.
ప్రవాస తెలుగు ప్రజలు తనపై చూపిస్తున్న ఆప్యాయత, ప్రేమాను రాగాలకు రాజేంద్రప్రసాద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
“సముద్రాలు దాటి వచ్చినా తెలుగు ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలను చూస్తుంటే కన్నతల్లి ఒడిలో ఉన్నట్లే ఉంది. మీ ప్రేమే నన్ను ఇన్నేళ్లుగా నటుడిగా ముందుకు నడిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. పద్మశ్రీ పురస్కారం తనకు లభించిన గౌరవం మాత్రమే కాదని, తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ చెందుతుందన్నారు. నటుడిగా తన 49 ఏళ్ల ప్రయాణంలో నవ్వులను పంచి, ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం కన్నా పెద్ద అవార్డు మరొకటి లేదన్నారు.
ఈ కార్యక్రమానికి శ్వేత కొమ్మోజి వ్యాఖ్యాతగా వ్యవహరించగా… జగదీప్రెడ్డి అనుముల, పరమేష్ భీమ్ రెడ్డి, వేణు సంగాని, సతీష్ తుమ్ముల, రామకృష్ణ తాడిశెట్టి, గిరిధర్ మసిరెడ్డి, వేణు కోమటిరెడ్డి, ఫణి కంటేటి, రాజు కక్కెర, సురేష్ వెంకన్నగారి, సునీల్ కోగంటి, వెంకట్ సింగు తదితరులు పాల్గొన్నారు








