విదేశాల్లో ఉంటున్న NRI పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. భారత్‌కు రాకుండానే Life Certificate!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
విదేశాల్లో ఉంటున్న భారతీయ పెన్షనర్లకు ప్రతి ఏడాది ఒకే ప్రశ్న ఎదురవుతుంది. పెన్షన్ కొనసాగాలంటే Life Certificate కోసం ఇండియాకు రావాల్సిందేనా? వయసు మీద పడిన వారికి ఇది చిన్న విషయం కాదు. వేల కిలోమీటర్ల ప్రయాణం, విమాన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు.. కేవలం ఒక సర్టిఫికెట్ కోసం భారత్‌కు రావడం చాలా మందికి సాధ్యమయ్యే పని కాదు.
అయితే NRI పెన్షనర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. Life Certificate సమర్పించడానికి తప్పనిసరిగా భారత్‌కు రావాల్సిన అవసరం లేదు. విదేశాల్లో ఉంటూనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి.
Life Certificate ఎందుకు అంత కీలకం?
పెన్షన్ పొందుతున్న వ్యక్తి జీవించి ఉన్నాడని ప్రతి ఏడాది నిర్ధారించేందుకు Life Certificate తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తికాకపోతే పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇలాంటి ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం Jeevan Pramaan అనే Digital Life Certificate వ్యవస్థను తీసుకొచ్చింది. Aadhaar ఆధారిత authentication ద్వారా Life Certificateను డిజిటల్‌గా రూపొందించుకోవచ్చు. సర్టిఫికెట్ డిజిటల్ రిపోజిటరీలో నిల్వ అవుతుంది. సంబంధిత Pension Disbursing Agency దాన్ని యాక్సెస్ చేయగలదు.
కానీ విదేశాల్లో ఉంటున్న పెన్షనర్లకు పరిస్థితి కొంచెం భిన్నం. సమీపంలో Jeevan Pramaan Centre ఉండకపోవచ్చు. బ్యాంకు శాఖకు వెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. వయసు లేదా ఆరోగ్య పరిస్థితుల వల్ల వ్యక్తిగతంగా హాజరు కావడం కూడా కష్టమవుతుంది.
అందుకే NRI పెన్షనర్ల కోసం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు ముఖ్యమవుతున్నాయి.
1. బ్యాంకు అధికారి ద్వారా Life Certificate
భారత్‌లోని బ్యాంకు ద్వారా పెన్షన్ లేదా Family Pension తీసుకుంటున్న NRI పెన్షనర్‌కు బ్యాంకు మార్గం ఉపయోగపడుతుంది.
RBI Act, 1934లోని Second Scheduleలో ఉన్న బ్యాంకుల ద్వారా పెన్షన్ పొందుతున్నవారు, బ్యాంకులోని సంబంధిత అధికారి ద్వారా Life Certificateను ధృవీకరించించుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానంలో పెన్షనర్ తప్పనిసరిగా భారత్‌లోని Pension Disbursing Authority ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం ఉండదు.
అయితే విదేశాల్లో ఉన్న పెన్షనర్ ముందుగా తన బ్యాంకుతో మాట్లాడాలి. విదేశాల నుంచి Life Certificateను ఎలా సమర్పించాలి? ఏ పత్రాలు కావాలి? ఏ అధికారి దాన్ని ధృవీకరించాలి? అనే విషయాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది.
2. Authorized Representative ద్వారా కూడా
భారత్‌కు రావడం సాధ్యం కాని NRI పెన్షనర్‌కు మరో మార్గం Authorized Representative.
అంటే పెన్షనర్ స్వయంగా వెళ్లలేని పరిస్థితిలో, ఆయన తరఫున అనుమతి పొందిన ప్రతినిధి Life Certificateను సంబంధిత పెన్షన్ అధికారికి సమర్పించవచ్చు.
కొన్ని సందర్భాల్లో Magistrate, Notary, Banker లేదా Indian Diplomatic Representative వంటి అర్హత ఉన్న వ్యక్తులు Life Certificateను జారీ చేయడం లేదా ధృవీకరించడం చేయవచ్చు. ఆ తర్వాత Authorized Representative దాన్ని సంబంధిత Pension Disbursing Authorityకి అందజేయవచ్చు.
అయితే ఇక్కడ కూడా ముందుగానే వివరాలు తెలుసుకోవాలి. ఎవరిని Authorized Representativeగా అంగీకరిస్తారు? ఏ రకమైన సర్టిఫికెట్ కావాలి? ఏ పత్రాలు జత చేయాలి? అనే విషయాలను పెన్షన్ చెల్లించే సంస్థతో నిర్ధారించుకోవాలి.
3. Indian Embassy లేదా Consulate ద్వారా
విదేశాల్లో శాశ్వతంగా నివసిస్తున్న NRI పెన్షనర్లకు Indian Embassy, High Commission లేదా Consulate మరో ముఖ్యమైన మార్గం.
సంబంధిత భారత దౌత్య కార్యాలయం ద్వారా Life Certificate పొందే అవకాశం ఉంటుంది. Pension Payment Order (PPO), Passport, ఫొటో లేదా ఇతర అవసరమైన పత్రాల ఆధారంగా పెన్షనర్ వివరాలను ధృవీకరించవచ్చు.
ఇది ముఖ్యంగా వృద్ధ పెన్షనర్లకు ఉపయోగపడే విధానం. ఎందుకంటే కేవలం Life Certificate కోసం విదేశాల నుంచి భారత్‌కు రావాల్సిన అవసరం ఉండదు.
ఇంకా ఒక విషయం. పెన్షనర్ వయసు లేదా ఆరోగ్య కారణాల వల్ల స్వయంగా Embassy లేదా Consulateకు వెళ్లలేని పరిస్థితి ఉంటే, కొన్ని సందర్భాల్లో అవసరమైన పత్రాలను పోస్టు ద్వారా పంపే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగతంగా హాజరు కాలేని కారణాన్ని చూపించేందుకు Medical Certificate వంటి పత్రం అవసరం కావచ్చు.
అయితే ప్రతి Indian Missionలో విధానం ఒకేలా ఉండకపోవచ్చు. కాబట్టి ముందుగా సంబంధిత Embassy లేదా Consulateను సంప్రదించడం మంచిది.
4. ఇంట్లో నుంచే Digital Jeevan Pramaan
టెక్నాలజీని ఉపయోగించగలిగే NRI పెన్షనర్లకు Digital Life Certificate అత్యంత సౌకర్యవంతమైన మార్గంగా మారవచ్చు.
Jeevan Pramaan ద్వారా Aadhaar ఆధారంగా Life Certificateను డిజిటల్‌గా రూపొందించుకోవచ్చు. Face Authentication సదుపాయం ఉండటంతో కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌నే ఉపయోగించి authentication పూర్తి చేసే అవకాశం ఉంది.
కాగితపు సర్టిఫికెట్ తీసుకుని బ్యాంకు లేదా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.
అయితే ఇక్కడ కూడా ముందుగానే సిద్ధం కావడం మంచిది. Aadhaar వివరాలు, అవసరమైన మొబైల్ సదుపాయాలు, సంబంధిత యాప్ లేదా పరికరం, పెన్షన్ చెల్లించే సంస్థ Jeevan Pramaan వ్యవస్థతో అనుసంధానమై ఉందా వంటి విషయాలు చూసుకోవాలి.
చివరి నిమిషంలో ప్రయత్నించి సమస్య ఎదుర్కొనే కంటే ముందుగానే ఒకసారి ప్రక్రియను పూర్తి చేసి చూడటం సురక్షితం.
Life Certificate సమర్పించిన తర్వాత మరోసారి చెక్ చేయండి
NRI పెన్షనర్లు ఎక్కువగా మర్చిపోయే విషయం ఇదే.
Certificate తయారైంది. పంపించేశారు. అంతే పని అయిపోయిందని అనుకోవద్దు.
అది సంబంధిత Pension Disbursing Authorityకి చేరిందా? రికార్డులో update అయిందా? పెన్షన్ కొనసాగింపుకు ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారా? ఇవి కూడా చూడాలి.
Digital Jeevan Pramaan అయితే successful authentication తర్వాత Life Certificate డిజిటల్ రిపోజిటరీలో నిల్వ అవుతుంది. సంబంధిత Pension Disbursing Agency దాన్ని యాక్సెస్ చేయగలదు.
బ్యాంకు, Embassy లేదా Authorized Representative ద్వారా సమర్పించినట్లయితే acknowledgement లేదా receipt తీసుకుని ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే Life Certificate ఇవ్వడం ఒక పని. అది స్వీకరించబడిందని నిర్ధారించుకోవడం మరో పని.
అయితే చివరి నిమిషం వరకు వేచి ఉండకండి. మీ పెన్షన్ చెల్లించే బ్యాంకు లేదా సంస్థ ఏ విధానాన్ని అంగీకరిస్తుందో ముందుగానే తెలుసుకోండి. అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి. Certificate సమర్పించిన తర్వాత అది రికార్డులో update అయిందా లేదా కూడా నిర్ధారించుకోండి.








