డేటా సెంటర్ల బూమ్.. రెట్టింపు కానున్న ఇన్సూరెన్స్ మార్కెట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనలో దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని అతిపెద్ద మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డేటా సెంటర్ల (Data Centers) నిర్మాణాలు శరవేగంగా పెరుగుతున్నాయి. అయితే ఈ వేగవంతమైన విస్తరణ కారణంగా నిర్మాణ, నిర్వహణ, వాతావరణ, ఇన్సూరెన్స్ (బీమా) పరంగా సరికొత్త ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని ప్రముఖ బీమా సంస్థ ‘అలియాంజ్ కమర్షియల్’ (Allianz Commercial) తన తాజా నివేదికలో వెల్లడించింది. అలియాంజ్ కమర్షియల్ విడుదల చేసిన ‘ది డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ బూమ్: రిస్క్స్ అండ్ క్లెయిమ్స్ ట్రెండ్స్’ (The data center construction boom: risks and claims trends) నివేదికలోని ముఖ్యాంశాలు:
భారీ పెట్టుబడులు.. గ్లోబల్ విస్తరణ
డేటా సెంటర్లపై (Data Centers) వార్షిక పెట్టుబడులు 2024లో ఉన్న 500 బిలియన్ డాలర్ల నుంచి 2027 నాటికి ఏకంగా 1 ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్లకు రెట్టింపు కానున్నాయి. ఇందులో సర్వర్ హాళ్లతో పాటు విద్యుత్ ఉత్పత్తి, గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కూలింగ్ వ్యవస్థలు, నెట్వర్కింగ్, సెమీకండక్టర్ల పెట్టుబడులు కూడా ఉన్నాయి. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న సామర్థ్యంలో 62 శాతం అమెరికా, చైనాల నుంచే రానుంది. యూరప్‌లో జర్మనీ, యూకే, ఐర్లాండ్ ప్రధాన మార్కెట్లుగా కొనసాగుతుండగా.. విద్యుత్ లభ్యత, అనుమతులు సులభంగా ఉండే స్పెయిన్, ఫిన్లాండ్, డెన్మార్క్‌లలో విస్తరణ వేగవంతం కానుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో (చైనా మినహా) ప్రస్తుతమున్న 9GW సామర్థ్యం 2030 నాటికి 28GW కు పెరగనుండగా, మలేషియా ఏకంగా 10 రెట్ల వృద్ధిని సాధించనుందని అంచనా.
ఆర్థిక అడ్డంకుల కంటే భౌతిక సవాళ్లే ఎక్కువ
డేటా సెంటర్ల (Data Centers) రంగానికి ఇప్పుడు ఆర్థిక నిధుల కంటే నైపుణ్యం కలిగిన కార్మికులు, విద్యుత్ లభ్యత, గ్రిడ్ కనెక్షన్లు, ప్రత్యేక పరికరాల కొరత అతిపెద్ద అడ్డంకులుగా మారాయి. ఒక్క అమెరికాలోని నిర్మాణ రంగంలోనే సుమారు 4,39,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉండగా, 2026 నాటికి మరో 3,49,000 మంది అదనపు కార్మికులు అవసరం అవుతారని నివేదిక అంచనా వేసింది.
వాతావరణ మార్పుల ముప్పు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ల (Data Centers) సామర్థ్యంలో 79 శాతం ఇప్పటికే ప్రకృతి విపత్తుల (Natural Catastrophes) ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లోనే ఉండటం గమనార్హం. మరో 54 శాతం కరువు, తీవ్రమైన వడగాల్పుల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అమెరికాలోని నార్తర్న్ వర్జీనియా, మలేషియాలోని జోహోర్, ఫ్రాన్స్‌లోని మార్సెయిల్ లాంటి వేగంగా ఎదుగుతున్న ఏఐ మార్కెట్లు ఈ వాతావరణ ముప్పు ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయి. అమెరికాలో వరదలు, కార్చిచ్చులు, తుఫాన్ల ప్రమాదం అత్యధికంగా (86% సామర్థ్యంపై ప్రభావం) ఉండగా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు, కరువు ప్రమాదం (89%) ఎక్కువగా ఉంది.
2030 నాటికి రెట్టింపు కానున్న ఇన్సూరెన్స్ మార్కెట్
కేవలం డేటాను నిల్వ చేసే సాధారణ కేంద్రాల (Data Centers) దశ నుంచి, డేటా సెంటర్లు నేడు అత్యాధునిక ఏఐ అవసరాలను తీర్చే కీలకమైన మౌలిక సదుపాయాలుగా (మిషన్-క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) మారుతున్నాయని అలియాంజ్ కమర్షియల్ సీఈఓ థామస్ లిల్లెలండ్ తెలిపారు. విద్యుత్ సరఫరా, బలమైన సప్లై చైన్, వాతావరణ పరిస్థితులకు తట్టుకునేలా స్థల ఎంపిక, బీమా రక్షణ లాంటి అంశాలే వీటి మనుగడను నిర్ణయిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కో ఏఐ క్యాంపస్ నిర్మాణ వ్యయం 20 బిలియన్ డాలర్లను కూడా దాటుతోంది. ఈ నేపథ్యంలో భారీ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ లభించాలంటే సమగ్రమైన బీమా రక్షణ ప్రాథమిక అవసరంగా మారింది. దీంతో గ్లోబల్ డేటా సెంటర్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్రస్తుతమున్న 11 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 24 బిలియన్ డాలర్లకు పెరగనుందని అంచనా.
నష్టాల్లో అగ్నిప్రమాదాలదే అగ్రస్థానం
అలియాంజ్ పరిశ్రమ డేటా విశ్లేషణ ప్రకారం, సుమారు 800 మిలియన్ డాలర్ల (700 మిలియన్ యూరోలు) విలువైన ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో 50 శాతానికి పైగా నష్టాలు (Severity) అగ్నిప్రమాదాల వల్లే సంభవిస్తున్నాయి. ఆ తర్వాత ప్రకృతి విపత్తులు, సైబర్ దాడులు/నేరాలు, విద్యుత్ వైఫల్యాలు ఉన్నాయి. అయితే అత్యంత తరచుగా (Frequency) జరిగే ప్రమాదాల్లో మాత్రం నీటి లీకేజీ/నష్టం (Water damage) మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఆ తర్వాత ఉద్దేశపూర్వక దాడులు, అగ్నిప్రమాదాలు, పరికరాల బ్రేక్‌డౌన్ ఉన్నాయి. డేటా సెంటర్లు (Data Centers) భారీ హైపర్‌స్కేల్, కోలోకేషన్ క్యాంపస్‌లుగా మారుతుండటంతో ఏ చిన్న సంఘటన జరిగినా అది ఒకేసారి ఆస్తి, నిర్మాణం, వ్యాపార కొనసాగింపు, సైబర్ భద్రత తదితర బహుళ రంగాలపై క్లెయిమ్‌లకు దారితీస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ సంస్థలకు భవనం విలువ మాత్రమే కాకుండా, దాని లోపల ఉన్న పరికరాలు, బ్యాటరీలు, కూలింగ్ వ్యవస్థల భద్రత కూడా అత్యంత కీలకమని.. డేటా సెంటర్ల ప్రణాళికా దశ నుంచే రిస్క్ తగ్గించే డిజైన్లు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అలియాంజ్ కమర్షియల్ గ్లోబల్ హెడ్ (కన్స్ట్రక్షన్ క్లెయిమ్స్) క్రిస్టియన్ కోల్బే సూచించారు.








