విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతారా? కేంద్రం వివరణ
ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్ – విమాన ఇంధనం)లో ఇథనాల్ (Ethenol) కలపాలనే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. ఏటీఎఫ్‌లో ఇథనాల్ కలపాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. విమానయాన భద్రతకు సంబంధించి ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో, ప్రయాణికుల్లో అనవసర భయాందోళనలు సృష్టించినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రధానమైన ప్రాధాన్యత అని మంత్రి స్పష్టం చేశారు.
ఈ వివాదానికి దారితీసిన అంశంపై మంత్రి రామ్మోహన్ నాయుడు సాంకేతిక వివరణ కూడా ఇచ్చారు. ప్రధానంగా ఇథనాల్ (Ethenol), సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (ఎస్ఏఎఫ్ – SAF) రెండూ పూర్తిగా వేర్వేరు ఇంధనాలని ఆయన స్పష్టం చేశారు. ఎస్ఏఎఫ్ అనేది అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ – ICAO) చేత అధికారికంగా గుర్తించబడిన, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ధ్రువీకరించబడిన ఒక సురక్షితమైన విమాన ఇంధనమని ఆయన తెలిపారు. అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఎస్ఏఎఫ్ను విమానయానంలో వినియోగంలోకి తీసుకొస్తారని, కాబట్టి దానిని సాధారణ ఇథనాల్‌తో (Ethenol) పోల్చడం ఏమాత్రం సరికాదని వివరించారు. విమానయాన రంగం లాంటి సున్నితమైన అంశాల్లో కేవలం వాస్తవాల ఆధారంగా మాత్రమే చర్చ జరగాలని, భద్రతపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన హితవు పలికారు.








