‘డార్క్ ప్యాటర్న్స్’ మోసాలపై కఠిన చర్యలు, 9 దిగ్గజ సంస్థలకు జరిమానా
ఆన్లైన్ షాపింగ్‌లో వినియోగదారులను తెలివిగా తప్పుదోవ పట్టించి అడ్డదారిలో డబ్బులు వసూలు చేస్తున్న ‘డార్క్ ప్యాటర్న్స్’ (Dark Patterns) పద్ధతులపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (CCPA) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన తొమ్మిది ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై మొత్తం సుమారు రూ. 20 లక్షల మేర జరిమానాలు విధించింది. ఈ జాబితాలో ఇండిగో, జెప్టో, ఫస్ట్‌క్రై, ఫిజిక్స్ వాలా, బుక్‌మైషో, స్పైస్‌జెట్, ఫార్మాఈజీ, మెకాఫీ, అనుజ్ జిందాల్ అకాడమీ వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. 2023లో కేంద్రం తీసుకొచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్న సంస్థలపై ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో అధికారికంగా వెల్లడించింది. అలాగే ఈ-కామర్స్ సంస్థలన్నీ తమ ప్లాట్‌ఫామ్‌లను స్వయంగా ఆడిట్ చేసుకుని, ఇలాంటి మోసపూరిత పద్ధతులను తక్షణమే తొలగించాలని సీసీపీఏ కఠిన ఆదేశాలు జారీ చేసింది.
వినియోగదారుల స్పష్టమైన అనుమతి లేకుండానే ఆన్లైన్ షాపింగ్ కార్ట్‌లో ఆటోమేటిక్‌గా మెంబర్‌షిప్‌లు లేదా విరాళాలను చేర్చడం, చెల్లింపుల ఆఖరి స్టేజ్‌లో (కౌంటర్ వద్ద) అదనపు ఛార్జీలను చూపించడం, భావోద్వేగపూరిత సందేశాలతో వస్తువులు కొనేలా వినియోగదారులను మానసికంగా ఒత్తిడికి గురిచేయడం, అలాగే కౌంట్‌డౌన్ టైమర్లతో తప్పుడు అత్యవసర పరిస్థితిని (ఫేక్ అర్జెన్సీ) సృష్టించడం వంటి పద్ధతులను సీసీపీఏ ‘డార్క్ ప్యాటర్న్స్’గా (Dark Patterns) గుర్తించింది. ఈ అక్రమాలకు పాల్పడినందుకుగానూ జెప్టోకు అత్యధికంగా రూ. 7 లక్షలు, ఫిజిక్స్ వాలాకు రూ. 5 లక్షలు, అనుజ్ జిందాల్‌కు రూ. 3 లక్షలు, ఫస్ట్‌క్రైకు రూ. 2 లక్షల జరిమానా విధించారు. అలాగే ఫార్మాఈజీ, మెకాఫీ, స్పైస్‌జెట్‌లకు చెరో రూ. 1 లక్ష చొప్పున జరిమానా పడింది.
సీసీపీఏ జారీ చేసిన ఈ తాఖీదులతో కొన్ని సంస్థలు దిగివచ్చి తమ ప్లాట్‌ఫామ్‌లలో మార్పులు చేశాయి. ఉదాహరణకు ఇండిగో తన యాప్‌లో ప్రయాణికులపై ఒత్తిడి తెచ్చేలా ఉన్న ‘లేదు… నేను రిస్క్ తీసుకుంటాను’ (No, I will take the risk) లాంటి సందేశాన్ని పూర్తిగా తొలగించి, స్పష్టమైన ఆప్షన్ కనిపించేలా మార్పులు చేసింది. బుక్‌మైషో కూడా టికెట్లు బుక్ చేసేటప్పుడు ముందే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసి ఉంచే డొనేట్ (విరాళం) ఆప్షన్‌ను తొలగించింది. కాగా డేటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఈ డార్క్ ప్యాటర్న్స్ (Dark Patterns) కారణంగా దేశీయ ఆన్లైన్ యూజర్లు ఏటా ఏకంగా రూ. 25,000 నుంచి రూ. 28,000 కోట్ల వరకు అదనపు ఖర్చు భరించాల్సి వస్తోంది. దేశంలోని 30.4 కోట్ల ఆన్లైన్ కొనుగోలుదారుల్లో దాదాపు 88 శాతం మంది ఈ పద్ధతుల ప్రభావానికి గురవుతున్నారని, ఇలాంటి కనిపించని ఛార్జీలు, బలవంతపు సబ్స్క్రిప్షన్లు డిజిటల్ మార్కెట్‌పై వినియోగదారుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని సదరు నివేదిక హెచ్చరించింది.








