వారు నా వెంట నిలిస్తే .. తమిళనాడు తరహాలో మార్పు : రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని కొంతమంది నేడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తుండటం బాధాకరమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) అన్నారు. రవీంద్రభారతిలో కళాకారుడు ఏపూరి సోమన్న (Eepuri Somanna) 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై రూపొందించిన పుస్తకాన్ని రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడతానని తెలిపారు. గతంలో బీఆరఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా గళం విప్పింది నేనే. అందుకే అప్పటి సీఎం కేసీఆర్ (KCR) లక్ష్యంగా చేసుకున్నారు. మునుగోడు ( Munugode)లో నన్ను ఓడించేందుకు 100 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. ఏపూరి సోమన్న లాంటి కళాకారులకు అండగా ఉంటా. నేను గెలిపించిన ఓ ఎమ్మెల్యే కులం కార్డు అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. రాజకీయాలను మార్చే శక్తి నాకుంది. నిజాయతీ కలిగిన వారు నా వెంట నిలిస్తే తమిళనాడు (Tamil Nadu) తరహాలో రాజకీయ మార్పు తీసుకురాగలం అని అన్నారు.








