Facebook, Instagramపై ₹125 లక్షల కోట్ల దావా! పిల్లల్ని బానిసలుగా చేశారన్న ఆరోపణలు
మీ పిల్లాడు ఫోన్ తీసుకున్నాడు. Instagram ఓపెన్ చేశాడు. ఒక వీడియో చూశాడు. తర్వాత మరో వీడియో వచ్చింది. అది పూర్తయ్యేలోపే ఇంకోటి కనిపించింది. అలా చూస్తుండగానే గంట గడిచిపోయింది.
ఇదంతా చూసిన మనం సాధారణంగా ఏమంటాం? “ఫోన్ పిచ్చి పట్టింది.. !” అని. అయితే ఈ పిచ్చి దానంతట అదే పట్టలేదు. కంపెనీలు కావాలనే పట్టించాయి అనేదే ఇప్పుడు ఆరోపణ.
అంటే పిల్లాడు Instagramను వాడుతున్నాడా? లేక Instagramనే పిల్లాడి attentionను వాడుకుంటోందా?
ఇప్పుడు అమెరికా కోర్టులో మొదలైన భారీ కేసు సరిగ్గా ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. Facebook, Instagramను పిల్లలు, టీనేజర్లు ఎక్కువసేపు వదలకుండా ఉండేలా Meta ఉద్దేశపూర్వకంగా addictive ఫీచర్లు రూపొందించిందని నాలుగు అమెరికా రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
విషయం ఎంత పెద్దదంటే.. Metaపై కోరుతున్న గరిష్ఠ ఆర్థిక జరిమానా $1.4 ట్రిలియన్.. అంటే సుమారు ₹125 లక్షల కోట్లు!
అయితే ఈ కథలో అసలు షాక్ ఆ అంకె కాదు. ఒకవేళ కోర్టు Meta విషయంలో తప్పు చేసిందని తేల్చితే.. పిల్లలు సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలన్నదే కాదు, సోషల్ మీడియా కంపెనీలు పిల్లల attentionను ఎలా ఉపయోగించుకున్నారనే విషయంపై క్లారిటీ వస్తుంది.
అసలు ఆరోపణ ఏంటి?
Infinite scroll, notifications, recommendations వంటి ఫీచర్లు యూజర్‌ను మళ్లీ మళ్లీ యాప్‌లోకి తీసుకురావడానికి రూపొందించారని రాష్ట్రాల తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.
పెద్దవాళ్లు తమకు నచ్చినప్పుడు యాప్ మూసేయగలరు. కానీ పిల్లలు, టీనేజర్లలో self-control ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదన్నది ఇక్కడ కీలక వాదన.
అందుకే అమెరికా రాష్ట్రాలు ఇప్పుడు ఒక సూటి ప్రశ్న వేస్తున్నాయి. “ఈ బలహీనత Metaకు తెలుసా? తెలిస్తే.. అదే బలహీనతను తన వ్యాపార ప్రయోజనం కోసం ఉపయోగించుకుందా?”
అందుకే ‘Big Tobacco’ పోలిక
ఈ కేసును కొందరు న్యాయ నిపుణులు 1990లలోని Big Tobacco కేసులతో పోలుస్తున్నారు.
అప్పుడు సిగరెట్ కంపెనీలకు తమ ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని ఎంతకాలం నుంచో తెలుసా? తెలిసిన విషయాలను ప్రజల నుంచి దాచారా? అనే ప్రశ్నలు కోర్టుల నుంచి వచ్చాయి. చివరకు భారీ చట్టపరమైన చర్యలు, జరిమానాలు, మార్కెటింగ్ నిబంధనల్లో మార్పులు జరిగాయి. ఇప్పుడు అదే తరహా ప్రశ్న టెక్నాలజీ కంపెనీ ముందు నిలిచింది.
₹125 లక్షల కోట్ల కంటే పెద్ద సమస్య
$1.4 ట్రిలియన్ అనే మొత్తం నిజంగా కళ్లు తిరిగేంత పెద్దది. కానీ Metaకు అంతకంటే పెద్ద ప్రమాదం మరోటి. కోర్టు ఆదేశాలతో Facebook, Instagramలో మార్పులు చేయాల్సి రావడం.
రాష్ట్రాలు కేవలం డబ్బు మాత్రమే కోరడం లేదు. పిల్లలకు హాని కలిగించవచ్చని భావిస్తున్న కొన్ని addictive featuresలో మార్పులు, యువ వినియోగదారుల రక్షణకు మరిన్ని చర్యలు కూడా కోరుతున్నాయి.
అది జరిగితే Meta ఒక్కటే ప్రభావితం కాదు. TikTok, YouTube, Snapchat వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లపైనా ఇదే తరహా ప్రశ్నలు మరింత బలంగా రావచ్చు.
ఇప్పటికే సోషల్ మీడియా కంపెనీలపై వేలాది కేసులు అమెరికాలో ముందుకు వస్తున్నాయి.
Zuckerbergకు కూడా పెద్ద పరీక్ష
ఈ కేసులో Meta CEO Mark Zuckerberg సాక్షిగా హాజరయ్యే అవకాశం ఉండటం మరో కీలక అంశం. కంపెనీకి పిల్లలు, టీనేజర్లపై Instagram ప్రభావం గురించి అంతర్గతంగా ఏం తెలుసు? బయట ప్రపంచానికి ఏం చెప్పింది? ఈ రెండింటి మధ్య ఏదైనా తేడా ఉందా? అన్నది న్యాయవాదులు పరిశీలించే అవకాశం ఉంది.
Meta మాత్రం ఆరోపణలను ఖండిస్తోంది. యువత భద్రత కోసం తాము తల్లిదండ్రులు, నిపుణులు, చట్ట అమలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని చెబుతోంది.
ఏదైమైనా
ఒక కంపెనీ మనిషి బలహీనతను గుర్తించి, అదే బలహీనతతో అతన్ని తన ప్లాట్‌ఫారమ్‌లో ఎక్కువసేపు ఉంచితే.. అది తెలివైన బిజినెస్ డిజైన్? లేక హద్దు దాటిన వ్యాపార వ్యూహమా? అమెరికా కోర్టు ఇప్పుడు ఆ హద్దును గీయబోతోంది.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








