‘శ్రీదేవి త్వరలో వస్తోంది!’..ప్రియాంక చోప్రా ఇచ్చిన క్లూ అర్దం ఏమిటి!
శ్రీదేవి.. ఈ పేరు వినగానే ఒక తరం ప్రేక్షకుల జ్ఞాపకాలు ఒక్కసారిగా మనస్సులో కదులుతాయి. ఆమె పోషించిన పాత్రలు, పలికించిన భావాలు, తెరపై సృష్టించిన మాయాజాలం.. ఇవన్నీ ఆమె మన మధ్య లేకపోయినా ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని రాసుకున్న శ్రీదేవి జయంతి సందర్భంగా ఇప్పుడు మరోసారి ఆమె పేరు మార్మోగుతోంది.
శ్రీదేవి జయంతి సందర్భంగా గ్లోబుల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసిన ఓ పోస్ట్ ఆసక్తిని రేపుతోంది. ‘ఎంప్రెస్ – ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ పుస్తక కవర్ పేజీని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. ‘‘మీరు ఎంతో గుర్తుకొస్తున్నారు. స్వర్గంలో ఉన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు. శ్రీదేవి త్వరలో వస్తోంది’’ అంటూ నివాళులర్పించింది.
అయితే ప్రియాంక చెప్పిన ‘శ్రీదేవి త్వరలో వస్తోంది’ అనే ఒక్క మాటే ఇప్పుడు అసలు ఆసక్తికి కారణంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం బయోగ్రఫీ పుస్తకం రాబోతోందనే విషయాన్నే సూచిస్తోందా? లేక శ్రీదేవి జీవితాన్ని వెండితెరపైకి తీసుకురాబోతున్నారా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ముఖ్యంగా ఈ పోస్ట్‌ను శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ రీపోస్ట్ చేయడం మరింత ఆసక్తిని పెంచింది. దీంతో శ్రీదేవి బయోపిక్‌పై ఏదైనా కీలక ప్రకటన త్వరలో రావచ్చనే చర్చ మొదలైంది.
రచయిత ధీరజ్ యు. కుమార్ రచించిన ‘ఎంప్రెస్’ పుస్తకం శ్రీదేవి సినీ ప్రయాణంతో పాటు ఆమె వ్యక్తిగత జీవితంలోని ఎన్నో ఆసక్తికరమైన కోణాలను ఆవిష్కరించనుంది. 2023లోనే ఈ జీవిత చరిత్ర పుస్తకంగా రాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అది మరోసారి వార్తల్లోకి రావడంతో.. శ్రీదేవి కథ తెరపైకి వస్తుందా అనే ఆసక్తి సహజంగానే పెరిగింది.
అయితే శ్రీదేవి జీవితాన్ని సినిమాగా తీస్తే.. ఆమె పాత్రలో ఎవరు కనిపిస్తారు? ఇంతటి మహానటి జీవితాన్ని తెరకెక్కించే సాహసం చేసే దర్శకుడు ఎవరు? ఆమె వ్యక్తిగత జీవితంలోని సున్నితమైన అంశాలను తెరపై ఎలా చూపిస్తారు?
ఈ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం దొరకకపోవచ్చు. కానీ ప్రియాంక చోప్రా చెప్పిన ‘శ్రీదేవి త్వరలో వస్తోంది’ అనే మాట మాత్రం ఓ చిన్న క్లూతో వెళ్లిపోయింది. పుస్తకంగా శ్రీదేవి వస్తోంది అనేది ఖాయం. మరి.. వెండితెరపై కూడా మళ్లీ ఆమెను చూడబోతున్నామా?
ఆ సమాధానం కోసం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.








