కోలీవుడ్ లోకి జాన్వీ కపూర్?
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi kapoor) కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఆమె కురతి(Kurathi) అనే లేడీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ పా. రంజిత్(Pa. Ranjith)కు చెందిన నీలం ప్రొడక్షన్స్(Neelam Productions) నిర్మించనుండగా, డైరెక్టర్ సర్కునం(Narkunam) తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కొంతకాలంగా డిస్కషన్స్ లో ఉన్న ఈ సిరీస్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు చిత్రబృందం కసరత్తు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
పా. రంజిత్ పేరు ఈ ప్రాజెక్ట్‌తో అనుసంధానమవడం వల్ల ఈ సిరీస్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. సామాజిక అంశాలు, అట్టడుగు వర్గాల జీవన వాస్తవాలు, మహిళా కేంద్రిత కథనాలకు ప్రాధాన్యమిచ్చే నిర్మాతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే నేపథ్యంతో కురతి కూడా విభిన్నమైన కథాంశంతో రూపొందే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్ సినిమాలకు భిన్నంగా ఓటీటీ వేదిక కోసం రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ జాన్వీకి నటిగా మరో కొత్త కోణాన్ని చూపించే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే జాన్వీ కపూర్ సౌత్ లో తన ఉనికిని విస్తరించుకుంటున్నారు. ఎన్టీఆర్(NTR) సరసన దేవర: పార్ట్1(Devara1) ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ఆమె, అనంతరం రామ్ చరణ్(Ram Charan) నటించిన పెద్దిలో కూడా కనిపించారు. తమిళంలో నటించాలనే ఆసక్తిని గతంలో జాన్వీ స్వయంగా వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వార్త మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం హిందీ, తెలుగు భాషల్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె లగ్ జా గలే(Lag Jaa gale) వంటి సినిమాలకు కూడా కమిట్ అయ్యారు. తమిళ వెబ్ సిరీస్ వార్త నిజమైతే, దక్షిణాదిలో ఆమె కెరీర్‌కు ఇది మరో కీలక మలుపుగా మారే అవకాశముంది.








