విజయవాడ -వారణాసి మధ్య విమాన సర్వీసులు ప్రారంభం : రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ విమానాశ్రయం (Vijayawada Airport) నుంచి వారణాసి (Varanasi)కి నేరుగా నూతన ఇండిగో సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో రాష్ట్ర ప్రజలకు కాశీ యాత్ర మరింత సులభం కానుంది. ఈ విమాన సర్వీసులు వారానికి మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. మంగళ, గురు, శనివారాలు ఈ నగరాల మధ్య విమానాలు నడపనున్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశంలోని టైర్-2, టైర్-3 నగరాలను ప్రధాన విమానాశ్రయాలకు అనుసంధానం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజయవాడ-వారణాసి మధ్య నేరుగా విమాన సర్వీసు ప్రారంభం రాష్ట్ర విమానయాన రంగంలో మరో కీలక ముందడుగని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రయాణాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ కొత్త సర్వీసు ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చనుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్ (Kesineni Sivanath), బాలశౌరి (Balashowry), పౌర విమానయానశాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఇండిగో ప్రతినిధులు పాల్గొన్నారు.








