స్టేజీపై ‘విశ్వంభర’ పై సైలెన్స్, యాదృచ్ఛికమా? చిరు వ్యూహమా?
మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా గురించి మాట్లాడకపోవడం కూడా ఇప్పుడు ఓ వార్తగా,డిస్కషన్ పాయింట్ గా మారిపోయింది. అది కూడా UV Creations నిర్వహించిన ఓ కార్యక్రమంలో. తన కొత్త సినిమాకు సంబంధించిన విషయాలను ఉత్సాహంగా చెప్పిన చిరంజీవి.. అదే బ్యానర్‌పై చాలా కాలంగా తెరకెక్కుతున్న మరో భారీ సినిమాను మాత్రం పూర్తిగా పక్కన పెట్టారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్లో కొత్త చర్చను లేవనెత్తుతోంది. ‘విశ్వంభర’ ఎక్కడుంది?
UV Creations నిర్మించిన కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్‌కు హాజరైన చిరంజీవి.. దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తాను చేస్తున్న తదుపరి సినిమాపై చాలా అప్డేట్స్ చెప్పారు. అంతేకాదు, ఆ సినిమాకు ‘కదిరి’ అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు.
కానీ అదే వేదికపై ఎక్కడా విశ్వంభర పేరు మాత్రం వినిపించలేదు. చిరంజీవి మాట వరసకు కూడా ప్రస్తావించలేదు. UV Creations ప్రతినిధులు కూడా మాట్లాడలేదు. సాధారణంగా ఇలాంటి భారీ సినిమా గురించి కనీసం రిలీజ్‌పై ఓ చిన్న అప్డేట్ అయినా ఇస్తారు. కానీ ఈసారి అలాంటిదేమీ జరగలేదు. ఇదే అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది.
ఎందుకంటే విశ్వంభర సాధారణ సినిమా కాదు.బింబిసార వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో, త్రిష హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఓ ఫాంటసీ అడ్వెంచర్. చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రెండేళ్లకు పైగా ఈ సినిమా నిర్మాణంలో ఉంది.
అలాగే గత కొంతకాలంగా ‘విశ్వంభర’ దసరా బరిలోకి వస్తుందనే ప్రచారం జరుగుతోంది. VFX పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే సినిమా నిజంగా దసరాకు వస్తే.. అదే విషయాన్ని చిరంజీవి ఈ కార్యక్రమంలో ఎందుకు ప్రస్తావించలేదు? అసలు సమస్య ఎక్కడ వచ్చింది??
సమస్య కథలో కాదు.. విజువల్స్లోనా
విశ్వంభర విషయంలో అసలు చిక్కు ఇక్కడే మొదలైంది. భారీ ఫాంటసీ ప్రపంచాన్ని తెరపై చూపించాల్సిన ఈ సినిమాకు VFX అత్యంత కీలకం. కానీ గతంలో వచ్చిన టీజర్ విజువల్స్‌పై విమర్శలు రావడంతో మేకర్స్ మళ్లీ పనిలోకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచే విశ్వంభర ప్రయాణం నెమ్మదించింది.
అధికారికంగా పెద్దగా అప్డేట్స్ లేకపోవడం, రిలీజ్‌పై స్పష్టత రాకపోవడం, సినిమా ఎప్పుడు వస్తుందో మేకర్స్ చెప్పకపోవడంతో.. అభిమానుల్లో అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి.
దసరా విడుదలపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అందుకే ప్రస్తుతం ఇది ఒక ఇండస్ట్రీ రూమర్‌గానే చూడాల్సి ఉంటుంది.
కానీ చిరంజీవి మౌనం మాత్రం ఈ కథకు మరో ఆసక్తికరమైన కోణాన్ని ఇచ్చింది.
ఒకే బ్యానర్‌కు చెందిన కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్.. కొత్త సినిమా కదిరి గురించి మాట్లాడారు. టైటిల్ ప్రకటించారు. కానీ భారీ అంచనాలున్న విశ్వంభర గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు.
అది యాదృచ్ఛికమా? లేక VFX పనులు పూర్తయ్యే వరకు ఎలాంటి హైప్ క్రియేట్ చేయకూడదనే వ్యూహమా? లేదా దసరా రిలీజ్‌పై ఇంకా మేకర్స్‌కే పూర్తి క్లారిటీ రాలేదా? ప్రస్తుతం సమాధానం ఎవరి దగ్గరా లేదు.
ఒక విషయం మాత్రం స్పష్టం. విశ్వంభర విషయంలో ఇప్పుడు అభిమానులు కోరుకుంటున్నది మరో పోస్టర్ కాదు.. మరో గ్లింప్స్ కాదు. ఒక క్లియర్ రిలీజ్ డేట్. ఎందుకంటే రెండేళ్లుగా సాగుతున్న ఈ ప్రయాణానికి చివరికి ఒక గమ్యం ఉందని మెగాస్టార్ టీమ్ ఎప్పుడు చెబుతుందన్నదే ఇప్పుడు అసలు ఆసక్తి.
ఏదైమైనా..
ఇండస్ట్రీ వర్గాల ప్రకారం విశ్వంభర VFX పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయట. దసరా బరిలో సినిమాను దింపాలనే లక్ష్యంతో పనులు ‘వార్ ఫుటింగ్’లో జరుగుతున్నాయని సమాచారం. అంటే ఇప్పటివరకు కనిపించిన నిశ్శబ్దం సినిమా ఆగిపోయిందనే అర్థం కాకపోవచ్చు. తుఫాన్ కు ముందు సముద్రం సైలెంట్ అయ్యినట్లు అనుకోవాలి.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








