సింధులో ప్రతీ బిందువు ఓ రెడ్ లైన్.. హక్కుల్ని కాపాడుకుంటామన్న పాక్ ప్రధాని..!
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ ప్రారంభించిన జలయుద్ధం..పాకిస్తాన్ ను వణికిస్తోంది. ముఖ్యంగా సింధూ జలాల నిలిపివేతతో పాక్ లోని కీలక రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. పంజాబ్ సహా పలు రాష్టాలు సాగు, తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో సింధూ జలాల నిలిపివేతను ఉపసంహరించుకునేలా భారత్ పై ఒత్తిడికి పాక్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఫలితంగా పాక్ నేతలు.. భారత్ పై బెదిరింపులకు దిగుతున్నారు.
సింధూ జలాల ఒప్పందం విషయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. సింధూ జలాల్లో (Indus Water Treaty) తమకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును రెడ్లైన్గానే పరిగణిస్తామన్నారు. తమ నీటి హక్కులను కాలరాసేలా భారత్ ఎలాంటి చర్యలకు పాల్పడినా గట్టిగా బదులిస్తామని ప్రగల్బాలు పలికారు. పాక్ (Pakistan) స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్లామాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) కవ్వింపు వ్యాఖ్యలు చేశారు.
‘‘పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోంది. కానీ, దాన్ని మా బలహీనతగా చూడకూడదు. మా సార్వభౌమత్వానికి, రక్షణ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకునేది లేదు. 2025 మే నాటి కంటే గట్టిగా బదులిస్తాం’’ అంటూ గతేడాది ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలను షెహబాజ్ ప్రస్తావించారు. భారత్ (India)తో జరిగిన ఘర్షణల్లో తామే గెలిచామంటూ పాక్ ప్రధాని అసత్యాలు వల్లెవేశారు. అందువల్లే ‘సింధూ జలాల’ను భారత్ ఏకపక్షంగా నిలిపివేసిందని నిరాధార ఆరోపణలు చేశారు.
2025 ఏప్రిల్‌లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం.. పాక్‌తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. దీంతో అక్కడ వ్యవసాయంతో పాటు తాగునీటిపై తీవ్ర ప్రభావం పడుతోంది. సింధూ జలాలను విడుదల చేయాలని పదేపదే పాక్ డిమాండ్లు చేస్తోంది. అయితే నీరు, రక్తం కలిసి ప్రవహించలేవనీ, సీమాంతర ఉగ్రదాడులను ఆపితేనే ఈ అంశంపై ఆలోచిస్తామని భారత్ ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. ఏ అంతర్జాతీయ ఒప్పందమైనా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు తేలితే.. ఒక సార్వభౌమ దేశంగా దానిని రద్దు చేసే హక్కు భారత్‌కు ఉందని పేర్కొంది.








