ఏకంగా RTC బస్సే లేపేశారు…పాపం మధ్యలో పంక్చర్ ట్విస్ట్!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
బైక్ దొంగతనం చూశాం. కారు దొంగతనం చూశాం. కానీ ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లడం ఎప్పుడైనా చూశారా? మహారాష్ట్రలో కొందరు దొంగలు ఇదే చేశారు. డిపోలో పార్క్ చేసి ఉన్న కొత్త బస్సును చూసి.. “ఇదే మన రైడ్” అనుకున్నట్టున్నారు. బస్సును స్టార్ట్ చేసి దర్జాగా రోడ్డెక్కేశారు.
అసలు సినిమా ఇక్కడే మొదలైంది.
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఉన్న జమ్నేర్ ఎస్టీ డిపోలో కొత్త బస్సును పార్క్ చేసి ఉంచారు. సోమవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు డిపోలోకి ఎంటర్ అయ్యారు. చుట్టూ చూసుకున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా బస్సును స్టార్ట్ చేశారు. ఆ తర్వాత డిపో నుంచి బయటకు తీసుకెళ్లారు.
అంటే.. నో టికెట్. నో బుకింగ్. నో పర్మిషన్. డైరెక్ట్ డ్రైవ్!
కొంతదూరం వరకు దొంగల ప్లాన్ సూపర్ స్మూత్‌గా సాగింది. బస్సు కూడా వారి వెంట బాగానే వచ్చింది. కానీ దొంగల స్క్రిప్ట్‌లో లేని ట్విస్ట్ ఒకటి బస్సు నుంచి వచ్చింది.
టైర్ పంక్చర్!
అంతే.. దొంగల confidence ఒక్కసారిగా low battery అయిపోయింది. బస్సును ముందుకు తీసుకెళ్లలేకపోవడంతో ఓ గ్రామం దగ్గర దానిని వదిలేసి అక్కడి నుంచి జంప్ అయ్యారు.
ఇక్కడే ఈ చోరీ కథ కాస్త కామెడీగా మారింది.
ఏకంగా ఆర్టీసీ బస్సును దొంగిలించారు. కానీ దాన్ని ఎక్కువ దూరం తీసుకెళ్లలేకపోయారు. కారణం.. ఒక్క పంక్చర్!
మరోవైపు ఉదయం డిపోలో బస్సు కనిపించకపోవడంతో అధికారులు షాక్ అయ్యారు. “బస్సు ఎక్కడ?” అని వెతికితే.. అది డిపోలో లేదు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది.
కొంతమంది వ్యక్తులు డిపోలోకి వచ్చి బస్సును తీసుకెళ్లిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో అధికారులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.
అయితే ఇప్పుడు అసలు డిస్కషన్ దొంగల గురించే కాదు. డిపో సెక్యూరిటీ ఎక్కడ? అన్నదే.
ఇంత పెద్ద బస్సును డిపో నుంచి బయటకు తీసుకెళ్లేంత వరకు ఎవరూ గమనించలేదా? గేట్ దగ్గర చెకింగ్ లేదా? బస్సు బయటకు వెళ్తుంటే ఒక్కరైనా “అన్నా.. ఇది మీ బస్సేనా?” అని అడగలేదా?
దొంగలకు అయితే ఈ చోరీ ఒక “బిగ్ బ్రెయిన్ మూమెంట్” అనిపించి ఉండొచ్చు. కానీ బస్సు మాత్రం మధ్యలోనే “బ్రో.. నన్ను ఇంత దూరం తీసుకెళ్లడం నా వల్ల కాదు” అన్నట్టుగా పంక్చర్ అయిపోయింది.
ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు. ఆర్టీసీ అధికారులు కూడా డిపో భద్రతపై విచారణ చేస్తున్నారు.
మొత్తానికి.. బస్సు దొంగతనం చేయాలనే ఐడియా వచ్చింది. బస్సును స్టార్ట్ చేశారు. డిపో దాటారు. రోడ్డెక్కారు.
కానీ దొంగల ప్లాన్‌ను పోలీసులు కాదు.. పంక్చర్ ముందే ఆపేసింది!
ఈ కథలో అసలైన హీరో ఎవరో తెలుసా?
ఆ బస్సు టైర్.








