ఎన్డీయే నయా ప్లాన్.. కన్వీనర్ రేసులో చంద్రబాబు, నితీష్..!
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డియే కూటమి (NDA) మరింత దూకుడుగా, వ్యవస్థాగతంగా ముందుకు సాగేందుకు వీలుగా త్వరలోనే ఒక కన్వీనర్‌ను నియమించేందుకు కసరత్తు ప్రారంభమైంది. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య బలమైన సమన్వయం, విధానపరమైన నిర్ణయాల్లో వేగం పెంచాల్సిన అవసరముందని పలువురు కీలక నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. భాగస్వామ్య పార్టీల నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవించిన ప్రధాని మోదీ(Narendra Modi), ఎన్డీయే కూటమికి ఒక శాశ్వత కన్వీనర్‌ను నియమించే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ ప్రతిష్టాత్మక నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్ పదవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో(Chandrababu Naidu) పాటు, జేడీయూ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్లు జాతీయ స్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వాలను నడిపించిన అపార అనుభవం, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన ట్రాక్ రికార్డ్ ఉన్న చంద్రబాబు వైపు మెజారిటీ పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే కూటమిలోని అందరు భాగస్వామ్య నేతలతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యుడైన మరో సీనియర్ నేత పేరును కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు. కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వివిధ రాష్ట్రాల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, కూటమి పార్టీల మధ్య ఎప్పటికప్పుడు చర్చలు జరపడానికి ఒక ప్రత్యేక యంత్రాంగం అవసరమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే జరగబోయే ఎన్డీయే అగ్రనేతల ప్రత్యేక భేటీలో ఈ కన్వీనర్ నియామకంపై అధికారికంగా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.








