‘కారే కిల్లర్ గా మారితే??’: సెన్సేషన్ నవల Autokill పరిచయం
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక రోజు ఉదయం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే.. సడన్‌గా ఎదురుగా వస్తున్న కారు మీ మీదకు ఆగకుండా దూసుకొస్తే ఎలా ఉంటుంది? బాబోయ్ అనుకుంటూ వెన్నులో వణుకు పుడుతుంది కదా! ఎవరా చంపటానికి ట్రై చేస్తోంది అని చూస్తే… అసలు ఆ కారులో డ్రైవరే లేకపోతే ఇంకెంత భయమేస్తుంది? ఇప్పుడు ఇదే పాయింట్‌తో రీసెంట్గా వచ్చిన ఒక అదిరిపోయే టెక్నో-థ్రిల్లర్ నవల సోషల్ మీడియాలోనూ, బుక్ లవర్స్ మధ్యలోనూ పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. దాని పేరే ‘ఆటోకిల్’ (Autokill).
.
ఇది ఎవరో ఇమాజినేషన్ చేసి రాసిన సింపుల్ సైన్స్ ఫిక్షన్ కథ కాదు. దీన్ని రాసింది సామ్ ష్వార్ట్జ్, క్యారీ పెప్పర్. ఇందులో సామ్ ష్వార్ట్జ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఎవరో సాధారణ రచయిత కాదు, న్యూయార్క్ మాజీ ట్రాఫిక్ కమిషనర్! రోడ్లను, ట్రాఫిక్‌ను, నగరాలను దశాబ్దాలుగా నరనరానా స్టడీ చేసిన వ్యక్తి. అలాంటి మనిషి కలం నుంచి ఈ కథ వచ్చిందంటే, ఇందులో ఉన్న భయం కేవలం ఊహ కాదు.. రేపు పొద్దున మనందరికీ నిజంగా జరిగే ప్రమాదమే అని ఇట్టే అర్థమైపోతుంది.
ఇక కథలోకి వెళ్తే..
కాలం 2036. అమెరికా రోడ్ల మీద అన్నీ డ్రైవర్ లేని కార్లే! రోబోటాక్సీలు, ఆటోమేటెడ్ ట్రక్కులు.. అబ్బా, రోడ్డు మీద సగం వాహనాలు అన్నీ ఇలాంటివే. చూడ్డానికి ఇదో పెద్ద టెక్నాలజీ అద్భుతంలా అనిపిస్తుంది. కానీ, ఒక రోజు ఎవరూ ఊహించని విధంగా ఒక డ్రైవర్ లెస్ కారు సడన్‌గా ట్రాఫిక్ రూల్స్‌ని బ్రేక్ చేసి, నేరుగా వెళ్లి ఒక మహిళను గుద్ది చంపేస్తుంది.
అందరూ మొదట్లో ‘ఇదో చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్, బ్రేక్ ఫెయిల్ అయ్యి ఉంటుంది’ అని లైట్ తీసుకుంటారు. కానీ ఫెడరల్ సైబర్మార్షల్ అయిన డానా గ్రాంట్ అనే ఆఫీసర్‌కు దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందనే డౌట్ వస్తుంది. లోతుగా ఎంక్వైరీ మొదలుపెట్టేసరికి మైండ్ బ్లాక్ అయిపోయే విషయాలు బయటపడతాయి. ఆ కారులో అసలు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్ లేదు. మరి అది కావాలనే ఎందుకు గుద్దినట్లు? ఆ కార్ల సిస్టమ్‌ను ఎవరో కావాలనే హ్యాక్ చేశారా? అని ఎంక్వైరీ మొదలెడతారు.
అసలు అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది! ఒక కారులో సిస్టమ్ ని హ్యాక్ చేయడం వేరు.. రోడ్డు మీద తిరుగుతున్న వేలాది కార్లను ఒకేసారి కంట్రోల్లోకి తెచ్చుకోవటం వేరు. అలా జరిగితే? అప్పుడు రోడ్లపై ఉన్న కార్లన్నీ ఒక్కసారిగా మనుషుల్ని వేటాడే ఆయుధాలుగా మారిపోవా? అక్కడి నుంచి ఈ కథ సాధారణ నవల లాగా కాకుండా, గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పొలిటికల్ థ్రిల్లర్‌లా మారిపోతుంది.
ఈ నవలా విశేషాల్లో జనాలకు బాగా నచ్చుతున్న విషయం ఏంటంటే.. ఇందులో విలన్ ఒక ‘చెడ్డ రోబో’ కాదు. సినిమాల్లో లాగా రోబోలకు స్వయంగా బుర్రొచ్చి, “ఇక ఈ ప్రపంచం నాదే” అని మనుషులను చంపడం మొదలుపెట్టవు! కార్లకు కోపాలు, పగలు ఉండవు. వాటి వెనుక ఉన్న మనుషుల స్వార్థమే ఇక్కడ అసలు సిసలు విలన్.
ఉద్యోగం పోయిన ట్రక్ డ్రైవర్ కోపం, టెక్నాలజీ మీద నమ్మకం లేని ఒక తెలివైన వ్యక్తి కసి, రాజకీయ కక్షలు.. ఇవన్నీ కలిస్తే టెక్నాలజీని ఎంత పెద్ద రాక్షసిలా మార్చేయచ్చో రచయిత అద్భుతంగా చూపించారు.
‘ది న్యూయార్క్ టైమ్స్’ వాళ్లైతే ఈ పుస్తకాన్ని ఒక పక్కా ‘నెయిల్-బైటర్’ అని పొగిడేసారు. దీన్ని చదువుతున్నంతసేపు.. రేపు పొద్దున మనం రోడ్డు మీద వెళ్తూ ఒక డ్రైవర్ లేని కారు కనిపిస్తే, “వావ్, ఎంత మంచి టెక్నాలజీ!” అనుకునే మైండ్‌సెట్ పోయి, “అసలు ఈ కారు సిస్టమ్ ని ఇప్పుడు ఎవరు నడుపుతున్నారురా బాబు?” అని అనుమానంగా వెనక్కి తిరిగి చూసేలా చేస్తుంది.
మొత్తానికి టెక్నాలజీ మనల్ని రక్షించడానికి వస్తుందో, లేక మన కొంప ముంచడానికి తయారవుతుందో కళ్లకు కట్టినట్లు చూపించే పుస్తకం ఇది. మీకు ఇలాంటి మైండ్ బెండింగ్ థ్రిల్లర్స్ చదవడం ఇష్టమైతే, ఈ వీకెండ్లో ఈ బుక్‌ని పట్టుకోండి.








