భద్రాద్రి రామయ్య సాక్షిగా.. సీఎం రేవంత్ రెడ్డి శపథం
తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 78 సీట్లతో తామే అధికారంలోకి వస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. భద్రాద్రి రాముడి మీద ఒట్టు వేసి మరీ.. వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలిచి మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కే వరకు తాను విశ్రమించనని శపథం చేశారు.
ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్స్టాప్ పెట్టారు. వచ్చే శాసనసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2028 డిసెంబర్లో జరగవని, అవి 2029 మే లేదా జూన్ నెలల్లో జరుగుతాయని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ఆమోదించుకోవాలని చూస్తోందని ఆయన వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 119 నుంచి 182కు పెరుగుతుందని, అలాగే పార్లమెంట్ స్థానాల సంఖ్య 17 నుంచి 26కు పెరుగుతుందని కీలక విషయాలను పంచుకున్నారు. పెరిగే స్థానాల నేపథ్యంలో 2029 ఎన్నికల్లో కనీసం 117 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ మళ్లీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని భద్రాచలం రాముడిపై ఆన వేసి చెప్పారు. ప్రతిపక్షాల దొంగ సర్వేలను, కుట్రలను తిప్పికొట్టేందుకు తాను రోజుకు 18 గంటలు శ్రమిస్తానని సీఎం ప్రకటించారు.
తన రాజకీయ ఎదుగుదలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంగా పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మాయమాటలు, ధనబలాన్ని తట్టుకుని కాంగ్రెస్ 65 సీట్లు గెలుస్తుందని తాను ముందే చెప్పానని, అన్నట్టుగానే 64 సీట్లు సాధించామని, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో మరో రెండు సీట్లు గెలిచామని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ‘గుండు సున్నా’ వస్తుందని చేవెళ్ల సభలో తానే చెప్పానని, సరిగ్గా అలాగే జరిగిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ గడ్డ నుంచి కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని, పాపాల భైరవుడిని ఇప్పటికే ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశామని తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయబోతున్నారని కేసీఆర్ చెల్లెలే స్వయంగా చెబుతోందని, ఆంధ్రా కాంట్రాక్టర్ల దగ్గర కేసీఆర్ డబ్బులు తీసుకున్నారని కూడా ఆమే బయటపెట్టిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నింపాలని బీఆర్ఎస్ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అక్కడ నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోతుందన్నారు. రాజకీయాల కోసం భద్రాద్రి రాముడు మునగాలా? అని ప్రశ్నించారు. తాటిచెట్టంత పెరిగిన హరీశ్‌రావుకు బుర్రలో గుజ్జు లేదన్నారు. ఆయన రాత్రి పూట బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని, నేను చెప్పేది అబద్ధమైతే.. కాదని హరీశ్ రావు ప్రమాణం చేయగలరా? అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
నాడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ‘వరి వేస్తే ఉరి’ అన్నారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వరి పండించిన రైతులకు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి గర్వంగా ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన ఈ రెండున్నరేళ్ల కాలంలోనే రైతు సంక్షేమం కోసం ఏకంగా రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని లెక్కలతో సహా వివరించారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదన్న బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ధైర్యముంటే కరెంట్ తీగలు పట్టుకోవాలని, కాకిలా మాడిపోతారని ఎద్దేవా చేశారు. ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్ అని పునరుద్ఘాటించారు. కేసీఆర్ నిరుద్యోగుల కలను నలిపేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 67 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తుచేశారు.
రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరిక మేరకు మధిరకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు సభ వేదికగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో అధిష్ఠానానికి 20 ఎంపీ సీట్లను గిఫ్ట్‌గా ఇస్తామని, త్వరలోనే 5 లక్షల మందితో ఖమ్మం వేదికగా రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.








