భారత్ తో కలిసి పనిచేస్తాం.. మోడీ రాక చారిత్రక ఘట్టమన్న న్యూజిలాండ్..!
న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని తమ దేశంలో అడుగుపెట్టడం ఒక చరిత్రాత్మక ఘట్టమని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ అభివర్ణించారు. ప్రధాని మోడీ రాక కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నామని, ఈ నిరీక్షణకు తగిన ఫలం దక్కిందని ఆయన అన్నారు.
ఆక్లాండ్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘కియా ఓరా మోదీ’ కార్యక్రమంలో లక్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ రోజు న్యూజిలాండ్ చరిత్ర సృష్టిస్తోంది. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్ గడ్డపై నిలబడ్డారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య చాలా సుదీర్ఘ విరామం. కానీ ప్రధాని మోడీ, ఐదు మిలియన్ల న్యూజిలాండ్ ప్రజల తరఫున చెబుతున్నా.. మీ రాక మా నిరీక్షణకు తగినది” అని వ్యాఖ్యానించారు.
10,000 మందికి పైగా ప్రవాస భారతీయులతో కిక్కిరిసిన ఆడిటోరియంను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఎంతో మంది పెద్ద స్టార్లు ప్రదర్శనలిచ్చిన ఈ వేదికపై ఇంతటి ఉత్సాహభరిత వాతావరణాన్ని తానెప్పుడూ చూడలేదని అన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సాధించిన అద్భుత పరివర్తన తనను నివ్వెరపరిచిందని లక్సన్ కొనియాడారు. “గత దశాబ్ద కాలంలోనే మోడీ నాయకత్వంలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది ప్రపంచంలోనే మానవ గౌరవాన్ని నిలబెట్టిన గొప్ప విజయాలలో ఒకటి. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మధ్యతరగతి వర్గాల్లో ఒకటైన 445 మిలియన్ల మంది భారత్‌లో ఉన్నారు. వారి ఆదాయాలు పెరిగి, ఉత్తమ జీవన ప్రమాణాలు అందుకుంటున్నారు” అని వివరించారు.
భారత్ సాధించిన అభివృద్ధిని లక్సన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “మోడీ హయాంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపై 157కి చేరింది. సుమారు 95,000 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులు నిర్మించారు. అంతరిక్ష రంగంలోనూ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండర్‌ను దించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది” అని గుర్తుచేశారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్రను నొక్కిచెప్పిన లక్సన్, త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అన్నారు. “21వ శతాబ్దం భారత్‌దే. ఈ భవిష్యత్ నిర్మాణంలో భారత్‌తో కలిసి పయనించాలని న్యూజిలాండ్ కోరుకుంటోంది” అని ఆయన స్పష్టం చేశారు.
న్యూజిలాండ్ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర అపారమని, వారి కఠోర శ్రమ వల్లే దేశం ఈ స్థాయిలో ఉందని ప్రశంసించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నాయకత్వం వహిస్తున్న మోడీ, తమ దేశానికి నిజమైన స్నేహితుడని లక్సన్ అభివర్ణించారు.








