ఉన్నత శిఖరాలకు ఆస్ట్రేలియా – భారత భాగస్వామ్యం..
భారత ప్రధాని మోడీ..ఆస్ట్రేలియా పర్యటనతో ఇరు దేశాల మధ్య మైత్రి, వాణిజ్య బంధం కొత్త శిఖరాలకు చేరాయి. రక్షణ, ఇంధనం, విద్య, సాంకేతికత వంటి కీలక రంగాలలో మొత్తం 18 ప్రధాన ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా భారత ప్రధాని మోడీకి.. ఆస్ట్రేలియాప్రధాని అల్బనీస్ ఘనస్వాగతం పలికారు. ఆస్ట్రేలియాకు నిజమైన మిత్రుడు మోడీ అంటూ స్నేహగీతం ఆలపించారు. మోడీ హయాంలో ఇరుదేశాల మధ్య బంధం ద్విగుణీకృతమైందంటూ ప్రశంసించారు. అల్బనీస్.. భారత్ కు మంచి స్నేహితుడని మోడీ తెలిపారు.
ఇరుదేశాల మధ్య కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. అందులో ముఖ్యమైంది పౌర అణుశక్తి ఒప్పందం.. ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి యురేనియం సరఫరాను సులభతరం చేసే అడ్మినిస్ట్రేటివ్ ఒప్పందం ఖరారైంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారం కోసం జాయింట్ డిక్లరేషన్, మారిటైమ్ సెక్యూరిటీ రోడ్‌మ్యాప్, తీరరక్షక దళాల మధ్య అవగాహన ఒప్పందాలు (MoU) కుదిరాయి.ఇరు దేశాలు ఇంధన భద్రత కోసం జాయింట్ స్టేట్మెంట్ను విడుదల చేశాయి.
ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ ఫిల్మ్ స్కూల్, భారత్‌లోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం జరిగింది. అలాగే వృత్తి విద్య ధృవపత్రాల గుర్తింపు కోసం అవగాహన కుదిరింది ‘పీఎం సూర్య ఘర్’ పథకంలో భాగంగా భారత్‌లో సౌర విద్యుత్ సాంకేతిక నిపుణులను తయారు చేసేందుకు రూఫ్‌టాప్ సోలార్ ట్రైనింగ్ అకాడమీని ప్రారంభించనున్నారు.
బంధం బలోపేతం:వ్యూహాత్మక భాగస్వామ్యం:
ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోడీ, ఆంథోనీ అల్బనీస్.. పరస్పర నమ్మకాన్ని, భద్రతా సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించారు.రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (CECA) త్వరగా పూర్తి కావాలని మోడీ ఆస్ట్రేలియా వ్యాపార వర్గాలను కోరారు. భారతదేశానికి చెందిన 11, 12 శతాబ్దాలకు చెందిన మూడు చారిత్రక విగ్రహాలను (నంది, భద్రకాళి త్రిశూలం, కార్తికేయ విగ్రహం) ఆస్ట్రేలియా ప్రభుత్వం తిరిగి అప్పగించింది. భారత్ సాంప్రదాయ జ్ఞానాన్ని ఇతరులు కాపీ కొట్టకుండా ఉండేందుకు, డిజిటల్ లైబ్రరీని ఆస్ట్రేలియా పేటెంట్ పరిశీలకులకు అందుబాటులోకి తెచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.ఈ పర్యటన ద్వారా ఇరు దేశాలు భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి, వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక బలమైన పునాదిని ఏర్పరచుకున్నాయి








