ఏం చేస్తారో ఏమో తెలీదు.. మా పెద్ది మాత్రం కాపాడండి : కేసీఆర్
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సికింద్రాబాద్ (Secunderabad)లోని యశోద ఆసుపత్రి (Yashoda Hospital)లో చేరారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ అధినేత కేసీఆర్ ( KCR)వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సుమారు అర్ధగంట పాటు గడిపిన కేసీఆర్, నేరుగా వైద్యులను కలిసి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు వైద్యులు పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నామని, ఒకవేళ అవసరమైతే విదేశీ వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నప్పటికీ, మెదడు పనితీరు మాత్రం సాధారణ స్థితికి రావాల్సి ఉందని వెల్లడించారు. దీనిపై స్పష్టత రావడానికి మరో 48 గంటల సమయం పడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఏం చేస్తారో ఏమో తెలీదు.. మా పెద్ది సుదర్శన్ రెడ్డిని మాత్రం కాపాడండి అంటూ వైద్యులకు చేతులు జోడించి కంటతడి పెట్టుకుంటూ విజ్ఞప్తి చేశారు.
చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించి, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా మెరుగైన వైద్యం అందించి, ఆయనను పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తీసుకువచ్చేలా చూస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. వైద్యుల నిరంతర కృషి, దైవానుగ్రహం, ప్రజల ఆశీస్సులతో సుదర్శన్ రెడ్డి త్వరలోనే కోలుకుంటారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.








