ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీ పెట్టుబడులు.. 42 బిలియన్ డాలర్లకు ఏఐ-ఐఏఏఎస్ వ్యయం!
ప్రపంచవ్యాప్తంగా ఏఐ-ఆప్టిమైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ (IaaS) వ్యయం 2026 నాటికి 96 శాతం భారీ వృద్ధితో 42.2 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని ప్రముఖ బిజినెస్ అండ్ టెక్నాలజీ ఇన్సైట్స్ సంస్థ ‘గార్ట్నర్’ (Gartner) వెల్లడించింది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM) శిక్షణకు మద్దతు ఇవ్వడంతో పాటు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు, వర్క్‌ఫ్లోలలో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతుండటమే ఈ (AI Infra) వృద్ధికి ప్రధాన కారణమని గార్ట్నర్ సీనియర్ ప్రిన్సిపల్ రీసెర్చ్ అనలిస్ట్ హర్దీప్ సింగ్ తెలిపారు. 2025లో 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్.. భవిష్యత్తులోనూ అధిక వృద్ధిని కొనసాగిస్తూ 2027 నాటికి 66.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని గార్ట్నర్ అంచనా వేసింది. ఇక మొత్తం ఐఏఏఎస్ (Total IaaS) విభాగంలో వ్యయం 2025లోని 222.1 బిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 287.3 బిలియన్ డాలర్లకు, 2027 నాటికి 359.8 బిలియన్ డాలర్లకు పెరగనుంది.
ట్రైనింగ్ కంటే ‘ఇన్ఫరెన్స్’ పైనే భారీ వ్యయం
స్వయంప్రతిపత్తి గల ‘ఏజెంటిక్ ఏఐ’ (Agentic AI) వినియోగం పెరగడంతో మల్టీ-స్టెప్ పనులు వేగవంతం అవుతున్నాయి. దీనివల్ల ఏఐ అప్లికేషన్ల శిక్షణ (Training) కంటే, వాటి వాస్తవ అమలు లేదా వినియోగం (Inference) ప్రధాన మార్గంగా మారుతోంది. 2026 నాటికి ఏఐ ఇన్ఫరెన్స్పై చేసే గ్లోబల్ వ్యయం (23.3 బిలియన్ డాలర్లు) ట్రైనింగ్ వ్యయాన్ని (19 బిలియన్ డాలర్లు) దాటేస్తుందని అంచనా. 2026లో ఏఐ-ఆప్టిమైజ్డ్ ఐఏఏఎస్ (AI Infra) వ్యయంలో 55 శాతం కేవలం ఇన్ఫరెన్స్ కోసమే కేటాయిస్తారని, 2027 నాటికి ఇది 59 శాతానికి చేరుకుంటుందని నివేదిక పేర్కొంది.
సంస్థలు ఏఐ మోడల్ డెవలప్మెంట్ దశ నుంచి పూర్తిస్థాయి వినియోగం (AI Infra) వైపు మారుతున్నాయని హర్దీప్ సింగ్ వివరించారు. ఈ క్రమంలో డొమైన్-స్పెసిఫిక్ మోడల్స్‌ను (DSMs) కస్టమర్-ఫేసింగ్, ఆపరేషనల్ సిస్టమ్స్‌లో నిరంతరం రియల్ టైమ్‌లో ఉపయోగించాల్సి వస్తోందని, ఈ మార్పు వల్ల క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
భారత్‌లో గార్ట్నర్ ఐటీ సింపోజియం
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో (AI Infra) ఏఐని ఎలా వాడుకోవాలనే దానిపై సీఐఓలు (CIOs), టెక్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం గార్ట్నర్ ప్రపంచవ్యాప్తంగా ఐటీ సింపోజియం సదస్సులను నిర్వహించనుంది. ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, స్పెయిన్లతో పాటు భారతదేశంలో కూడా ఈ సదస్సు జరగనుంది. 2026 నవంబర్ 16 నుంచి 18 వరకు కేరళలోని కొచ్చి వేదికగా ఈ ‘గార్ట్నర్ ఐటీ సింపోజియం’ జరగనున్నట్లు సంస్థ ప్రకటించింది.








