‘Q-Day’ భయంలో ప్రపంచం, అసలు అదేంటి?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
మనం రోజూ వారీ పంపుకొనే WhatsApp మెసేజ్‌లు.. బ్యాంక్‌లో చేసిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్.. క్లౌడ్‌లో పెట్టుకున్న వ్యక్తిగత ఫొటోలు.. కంపెనీ సర్వర్లలో ఉన్న రహస్య డాక్యుమెంట్లు.. ఇవన్నీ ఇన్నాళ్లూ సురక్షితంగానే ఉన్నాయని అనుకుంటాం. ఎందుకంటే వాటి మీద బలమైన ఎన్క్రిప్షన్ అనే తాళం ఉంది. కానీ ఆ తాళాన్ని పగలగొట్టడానికి అవసరమైన శక్తి ఉన్న కంప్యూటర్ ఒకరోజు ప్రపంచం చేతుల్లోకి వస్తే?
అప్పటివరకు సురక్షితంగా అనుకున్న డేటా అంతా ఒక్కసారిగా గతం నుంచి బయటకు రావచ్చు. రహస్యం అనుకున్నది రచ్చై పోవచ్చు. ఇదే ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న ‘Q-Day’ భయం.
అసలీ టెక్నాలిజీ ఏమిటి
కృత్రిమ మేధస్సు తర్వాత ప్రపంచం ఎక్కువగా మాట్లాడుకుంటున్న మరో టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్. సాధారణ కంప్యూటర్లు సంవత్సరాలు, కొన్ని సందర్భాల్లో బిలియన్ల సంవత్సరాలు పట్టే కొన్ని క్లిష్టమైన లెక్కలను క్వాంటమ్ కంప్యూటర్లు చాలా తక్కువ సమయంలో పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉంటాయి.
అయితే క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావం ప్రతి రంగంపైనా ఉండకపోవచ్చు. AIలా ఇది ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేసే సాధారణ ప్రయోజన టెక్నాలజీ కాకపోవచ్చు. కాంప్లెక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ సిమ్యులేషన్లు, కొన్ని ప్రత్యేకమైన గణిత సమస్యలు వంటి రంగాల్లోనే దీని అసలు శక్తి బయటపడే అవకాశం ఉంది. కానీ ఒక రంగంలో మాత్రం దీని ప్రభావం విపరీతంగా ఉండొచ్చు. అది సైబర్ సెక్యూరిటీ.
ఎందుకింత భయం
ఈరోజు మన డిజిటల్ ప్రపంచం మొత్తం కొన్ని గణిత సమస్యలను పరిష్కరించడం చాలా కష్టం అనే నమ్మకంపై నిలబడి ఉంది. మన బ్యాంకింగ్ వివరాల నుంచి ఈ-మెయిల్స్ వరకు, కంపెనీల రహస్య డేటా నుంచి వ్యక్తిగత ఫొటోల వరకు.. వీటన్నింటినీ ఎన్క్రిప్షన్ అనే డిజిటల్ తాళం కాపాడుతోంది. సాధారణ కంప్యూటర్లతో ఆ తాళాన్ని పగలగొట్టడానికి అసాధ్యమైనంత సమయం పడుతుంది. కానీ శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోవచ్చు.
అందుకే టెక్ ప్రపంచంలో ‘Q-Day’ అనే పదం వినిపిస్తోంది. అంటే క్వాంటమ్ కంప్యూటర్ ప్రస్తుత ఎన్క్రిప్షన్ పద్ధతులను సమర్థంగా ఛేదించగల స్థాయికి చేరుకునే రోజు.
ఇక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది. Q-Day వచ్చిన తర్వాతే డేటా దొంగతనం మొదలవుతుందని అనుకోవడం తప్పు.
ఈరోజే ప్రపంచంలోని కొన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, సైబర్ నేరగాళ్లు ఎన్‌క్రిప్ట్ చేసిన సమాచారాన్ని సేకరించి భద్రపరుస్తున్నారనే ఆందోళన ఉంది. ఎందుకంటే వారికి ఒక ఆశ ఉంది—ఇప్పుడది తెరవలేకపోయినా, భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్లు వచ్చినప్పుడు ఆ డేటాను డీక్రిప్ట్ చేయవచ్చు. దీనినే “Harvest Now, Decrypt Later” అనే వ్యూహంగా పిలుస్తారు.
అంటే మీరు ఈరోజు పంపిన ఒక రహస్య ఫైల్.. ఈరోజు దొంగిలించబడినా వెంటనే ఎవరికీ ఉపయోగపడకపోవచ్చు. కానీ పదేళ్ల తర్వాత దాన్ని తెరవగలిగే సాంకేతికత వచ్చిందనుకోండి. అప్పుడు ఆ పాత డేటా కూడా కొత్తగా ప్రమాదంలో పడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రహస్యాలు, సైనిక సమాచారం, వైద్య రికార్డులు, ఆర్థిక వివరాలు, పరిశోధన డేటా వంటి వాటికి ఇది తీవ్రమైన సమస్య.
మరి పరిష్కారం లేదా?
ఉంది. అదే Post-Quantum Cryptography — PQC.
క్వాంటమ్ కంప్యూటర్లు వచ్చినా సులభంగా ఛేదించలేని గణిత పద్ధతుల ఆధారంగా రూపొందిస్తున్న కొత్త తరం ఎన్క్రిప్షన్ ఇది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దీనికోసం క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేవరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సాధారణ కంప్యూటర్లపైనే PQCని అమలు చేయవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రముఖ బ్రౌజర్లు, మెసేజింగ్ సేవలు, క్లౌడ్ కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి.








