Windfall Tax: పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు
భారత ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్‌ఫాల్ పన్నుల (Windfall Tax) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, మరియు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF – విమాన ఇంధనం) ఎగుమతులపై పన్నులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరించిన కొత్త నిబంధనలు శనివారం నుంచే అమలులోకి వచ్చాయి.
తాజా తగ్గింపులు
పెట్రోల్: పెట్రోల్ ఎగుమతులపై గతంలో ఉన్న లీటరుకు రూ. 3.5 పన్నును ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి, దానిని సున్నా (Zero)గా నిర్ణయించింది.
డీజిల్: డీజిల్ ఎగుమతి సుంకాన్ని (Windfall Tax) లీటరుకు రూ. 25.5 నుంచి రూ. 24 లకు తగ్గించింది.
ఏటీఎఫ్ (విమాన ఇంధనం): విమానాలకు ఉపయోగించే ఏటీఎఫ్ పై పన్నును లీటరుకు రూ. 22 నుంచి రూ. 19.5లకు తగ్గించింది.
దేశీయ రిఫైనరీలకు లబ్ధి
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల దేశీయ రిఫైనరీలు, చమురు ఎగుమతి కంపెనీల మార్జిన్లు పుంజుకోనున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పుడు దేశీయ చమురు సంస్థలు పొందే అదనపు (అసాధారణ) లాభాలపై కేంద్ర ప్రభుత్వం ఈ విండ్‌ఫాల్ పన్నును విధిస్తుందన్న విషయం తెలిసిందే.
విండ్‌ఫాల్ పన్ను నేపథ్యం
ముడిచమురు ధరల అస్థిరత నేపథ్యంలో ఈ పన్నును తొలిసారిగా 2022 జూలైలో ప్రవేశపెట్టారు. రెండేళ్ల పాటు కొనసాగించిన తర్వాత దీనిని రద్దు చేసినప్పటికీ.. ఇరాన్ పరిణామాల కారణంగా ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అనూహ్యంగా పెరగడంతో, మార్చి 2026లో కేంద్ర ప్రభుత్వం దీనిని తిరిగి అమలులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మనదేశం అంతర్జాతీయ మార్కెట్లోని ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకుని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఎగుమతి సుంకాలను (Windfall Tax) సమీక్షించి అవసరమైన మార్పులు చేస్తోంది.








