Income Tax: విదేశీ ఆస్తులు, డిపాజిట్ల వెల్లడించేందుకు ఆదాయపు పన్ను శాఖ బంపర్ ఆఫర్!
విదేశాల్లో డిపాజిట్లు లేదా ఆస్తులు ఉండి, సాంకేతిక కారణాలు లేదా అవగాహన లోపం వల్ల గతంలో పన్ను రిటర్న్‌లలో (ITR) వాటిని చూపించని చిన్న పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ (Income Tax) ఒక అద్భుతమైన సువర్ణావకాశాన్ని కల్పించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) 2026-27 బడ్జెట్లో ప్రతిపాదించిన ‘చిన్న పన్ను చెల్లింపుదారుల విదేశీ ఆస్తుల వెల్లడి పథకం’ (FAST-DS – Foreign Assets Disclosure Scheme for Small Taxpayers)ను అధికారికంగా నోటిఫై చేసింది. ఈ పథకం ఆగస్టు 16 నుంచి డిసెంబర్ 31 వరకు పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా విదేశీ విద్యాభ్యాసం ముగించి స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులు, గ్లోబల్ ప్రాజెక్ట్‌లలో పనిచేసిన ఐటీ/టెక్ ఉద్యోగులు, యంగ్ ప్రొఫెషనల్స్, ప్రవాస భారతీయులను (NRI) దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ వెసులుబాటును తీసుకొచ్చింది.
పథకంలో రెండు కీలక వర్గాలు
ఈ పథకం కింద పన్ను (Income Tax) చెల్లింపుదారుల ఆస్తులను రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు:
పూర్తిగా వెల్లడించని ఆస్తులు: గతంలో పన్ను రిటర్నుల్లో అసలు వెల్లడించని రూ. 1 కోటి వరకు ఉండే విదేశీ ఆస్తి లేదా విదేశీ ఆదాయాన్ని స్వచ్ఛందంగా డిక్లేర్ చేసుకునే అవకాశం.
రిపోర్టింగ్ లోపాలు ఉన్న ఆస్తులు: గతంలో చట్టబద్ధంగా సంపాదించిన ఆదాయమే అయినప్పటికీ, ఐటీ రిటర్న్ షెడ్యూల్లో సాంకేతిక కారణాల వల్ల నివేదించని రూ. 5 కోట్ల వరకు ఉండే ఆస్తులను కేవలం రూ. 1 లక్ష నామమాత్రపు రుసుము చెల్లించి డిక్లేర్ చేసుకునే వెసులుబాటు.
ఈ పథకం కింద ఆస్తుల మార్కెట్ విలువను 2026 మార్చి 31 ప్రాతిపదికన లెక్కిస్తారు.
పన్ను విధానం
ఈ పథకం కింద అర్హులైన పన్ను (Income Tax) చెల్లింపుదారులు తమ వెల్లడించని విదేశీ ఆస్తి లేదా ఆదాయం విలువపై 30 శాతం ప్రాథమిక పన్నుతోపాటు, దానికి సమానమైన 30 శాతం అదనపు రుసుమును చెల్లించాలి. అంటే మొత్తంగా 60 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తికి విదేశీ బ్యాంకు ఖాతాలో రూ. 60 లక్షల డిపాజిట్, ఇతర మార్గాల్లో వచ్చిన రూ. 20 లక్షల విదేశీ ఆదాయం (మొత్తం రూ. 80 లక్షలు) ఉండి వెల్లడించకపోతే.. వారు రూ. 48 లక్షలు (60%) పన్ను (Income Tax) రూపంలో ప్రభుత్వానికి చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా క్రమబద్ధీకరించుకోవచ్చు.
చట్టపరమైన ప్రయోజనాలు & రక్షణ
ఈ పథకం ద్వారా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పన్ను (Income Tax) చెల్లించిన వారికి ప్రభుత్వం పూర్తి చట్టపరమైన రక్షణను కల్పిస్తోంది. వీరికి అత్యంత కఠినమైన నల్లధన చట్టం-2015 (Black Money Act), ఆదాయపు పన్ను చట్టం-1961 కింద భవిష్యత్తులో ఎదురయ్యే తదుపరి జరిమానాలు, ప్రాసిక్యూషన్లు, లేదా ఐటీ విభాగం తనిఖీల (Scrutiny) నుంచి పూర్తి స్థాయి మినహాయింపు లభిస్తుంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా విదేశీ ఆస్తులను సక్రమం చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు ఉన్న ఈ గడువును సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.








