India Economy: గ్లోబల్ టాప్-5లో మన బ్యాంకులు, ఫార్మా.. ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ ఆర్థిక లక్ష్యాలు
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ భవిష్యత్తు కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్థిక ప్రణాళికలను (India Economy) ఆవిష్కరించారు. భవిష్యత్తులో భారత్‌ను తిరుగులేని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలపడమే లక్ష్యంగా భారతీయ వ్యాపార సంస్థలకు భారీ లక్ష్యాలను నిర్దేశించారు. కేవలం దేశీయ మార్కెట్ పరిధిలోనే కాకుండా, ప్రపంచ దిగ్గజాలతో పోటీపడగల అంతర్జాతీయ స్థాయి కంపెనీలను రూపొందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ప్రపంచంలోని టాప్ 5 బ్యాంకులలో కనీసం ఒక భారతీయ బ్యాంకు, అలాగే అగ్రశ్రేణి టాప్ 5 ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒక భారతీయ సంస్థ కచ్చితంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. దీనికి తోడు అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ‘ఫార్చ్యూన్ 500’ (Fortune 500) జాబితాలో ఏకంగా 50 భారతీయ కంపెనీలకు (India Economy) చోటు కల్పించడమే తమ ప్రధాన ఆశయమని ప్రధాని ఉద్ఘాటించారు.
తయారీ రంగం: అసెంబ్లింగ్ నుంచి వాల్యూ చెయిన్ దాకా
రాబోయే ఐదు నుండి ఏడేళ్లలో దేశాన్ని ‘వికసిత్ భారత్’గా (అభివృద్ధి చెందిన భారత్) తీర్చిదిద్దేందుకు తయారీ, వ్యవసాయం, టెక్నాలజీ, రక్షణ, గ్రీన్ ఎకానమీ వంటి ఏడు కీలక రంగాలతో కూడిన ‘శక్తి కి సప్తధార’ అనే సరికొత్త రోడ్‌మ్యాప్‌ను (India Economy) ప్రధాని ఆవిష్కరించారు.
గణాంకాల ప్రగతి: గత 12 ఏళ్లలో దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ 7 రెట్లు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు, రక్షణ రంగ ఉత్పత్తి 4 రెట్లు పెరిగిన తీరును ఆయన గుర్తుచేశారు.
గ్లోబల్ సప్లై చైన్: భారత్ ఇకపై కేవలం ఉత్పత్తుల అసెంబ్లింగ్‌కే పరిమితం కాకూడదని స్పష్టం చేశారు. విడిభాగాల డిజైన్ నుంచి సంక్లిష్టమైన తుది ఉత్పత్తుల తయారీ (India Economy) వరకు మొత్తం వాల్యూ చెయిన్‌ను దేశీయంగానే నిర్మించాలని పిలుపునిచ్చారు.
40 దేశాలతో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (FTAs) వాడుకుంటూ అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ ఒక నమ్మకమైన కేంద్రంగా మారాలని సూచించారు.
టెక్నాలజీ: సెమీకండక్టర్ల నుంచి ‘మేడ్ ఇన్ ఇండియా 6జీ’కి
డిజిటల్, సాంకేతిక స్వావలంబనలో భాగంగా సెమీకండక్టర్ రంగానికి మోడీ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆధునిక ప్రపంచంలో చిప్‌ల ప్రాముఖ్యతను వివరిస్తూ.. దేశంలో ఇప్పటికే 3 ప్లాంట్లు రూపుదిద్దుకోగా, రాబోయే 7-8 ఏళ్లలో కొత్తగా మరో 5 నుండి 8 సెమీకండక్టర్ ప్లాంట్లు అందుబాటులోకి (India Economy) వస్తాయని వెల్లడించారు. అలాగే భారత్ అభివృద్ధి చేసిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను (DPI) ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడమే కాకుండా, ‘మేడ్-ఇన్-ఇండియా 6జీ’ (Made in India 6G) టెక్నాలజీని అంతర్జాతీయ మార్కెట్లకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఇంధన భద్రత: అణుశక్తి, గ్రీన్ ఎనర్జీ అడుగులు
దేశీయ పరిశ్రమల వేగవంతమైన విస్తరణకు అవసరమైన ఇంధన భద్రతను సాధించేందుకు అణు, సౌర, గ్యాస్ ఆధారిత రంగాలు కీలకంగా మారనున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
భారత దేశం 200 గిగావాట్ల అణుశక్తి ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తోందని, ఇందులో భాగంగా ఐదు కొత్త అణు రియాక్టర్లను నిర్మిస్తోందని వెల్లడించారు.
ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ సాధించిన అద్భుత పురోగతి ఇంధన స్వయం సమృద్ధికి (India Economy) దోహదపడుతుందన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 1.75 కోట్ల కుటుంబాలకు పైప్‌లైన్ గ్యాస్, 50 లక్షలకుపైగా కుటుంబాలకు సౌర విద్యుత్ అందుతోందని గణాంకాలను వివరించారు.
‘ఫ్రాజైల్ ఫైవ్’ నుంచి గ్లోబల్ లీడర్షిప్ వైపు..
2014 నాటికి ప్రపంచంలో అత్యంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థలుగా (India Economy) పేరొందిన ‘ఫ్రాజైల్ ఫైవ్’ (Fragile Five) జాబితాలో ఉన్న భారత్.. గత 12 ఏళ్లలో అనుసరించిన వేగవంతమైన, పకడ్బందీ విధానాల వల్ల నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందిందని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.
సంకుచిత ఆలోచనలను పక్కనపెట్టి, విశ్వవ్యాప్త దృక్పథంతో ముందడుగు వేస్తే వనరుల కొరత దేశాన్ని ఏమాత్రం ఆపలేదని ఆయన అన్నారు. గత ఏడు దశాబ్దాల్లో సాధించలేని అద్భుతమైన పురోగతిని రాబోయే ఐదు నుండి ఏడేళ్లలోనే సాధించి తీరాలనే బలమైన సంకల్పంతో ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్’ వైపు దేశం వేగంగా సాగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.








