“ముందు వాళ్లకు చెప్పు..” టీపీసీసీకి కోమటిరెడ్డి కౌంటర్
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పార్టీలోని పలువురు సీనియర్లు తమ అసంతృప్తిని ఏదో ఒక సందర్భంలో బయటపెడుతూనే ఉన్నారు. అయితే, తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధిష్ఠానం లేదా టీపీసీసీ నాయకత్వం నుంచి హెచ్చరికలు వస్తున్నా, వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా తనదైన శైలిలో మరింత ఘాటుగా స్పందిస్తూ ఆయన పార్టీ నాయకత్వానికి సవాల్ విసురుతున్నారు.
పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్లో బయటి నుంచి వచ్చిన నాయకుల ఆధిపత్యం పెరిగిపోయిందని బాహాటంగానే ఆరోపించారు. ఏళ్ల తరబడి జెండా మోసిన అసలైన కాంగ్రెస్ నాయకులు, నిబద్ధత కలిగిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి, ప్రభుత్వం పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా ఏపీకి తగినట్లు విధానాలు ఉన్నాయనేది ఆయన ప్రధాన అభియోగం.
ఈ విమర్శలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘పార్టీ గీత దాటితే ముఖ్యమంత్రితో సహా ఎవరినీ సహించేది లేదు’ అని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. సాధారణంగా ఇలాంటి హెచ్చరికల తర్వాత నేతలు వెనక్కి తగ్గడం చూస్తుంటాం. కానీ రాజగోపాల్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు సరికదా, మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా తిప్పికొట్టారు. “నాకు నీతులు చెప్పే బదులు ముందు సీఎం రేవంత్ రెడ్డికి నీతులు చెప్పు” అంటూ నేరుగా నాయకత్వానికే చురకలంటించారు. పీసీసీ చీఫ్ హెచ్చరికలను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఇచ్చిన కౌంటర్తో స్పష్టమైంది.
పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి చేరికల వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న గౌరవం నశిస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యంగా దానం నాగేందర్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి, తిరిగి సాంకేతికంగా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకోవడం ఎలాంటి ‘చిల్లర రాజకీయం’ అని సూటిగా ప్రశ్నించారు. సిద్ధాంతాలు లేని ఇలాంటి అవకాశవాద రాజకీయాలు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని.., రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఇకనైనా విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వభావరీత్యా దూకుడుగా వ్యవహరించే నాయకుడు. గతంలోనూ పార్టీ విధానాలు నచ్చనప్పుడు తన అసంతృప్తిని ఏమాత్రం దాచుకోకుండా బహిరంగంగానే వెల్లడించిన చరిత్ర ఆయనది. ఇప్పుడు కూడా ప్రభుత్వం నడుస్తున్న తీరు, వలస నేతలకు దక్కుతున్న ప్రాధాన్యతపై ఆయన గళమెత్తడం కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.
అధిష్ఠానం హెచ్చరికలను లెక్కచేయని ఆయన ధిక్కార వైఖరి పార్టీలోని పాత కాపుల అసంతృప్తికి అద్దం పడుతోంది. పీసీసీ చీఫ్ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఈ ఎదురుదాడి కాంగ్రెస్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో, అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి.








