ప్రధాని మోదీ ప్రసంగంలో ‘‘సప్తధార’’లు ఇవే…
ప్రధాని నరేంద్ర మోదీ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఎర్రకోట మీద జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. 2047 నాటికి వికసిత భారత్ సాధిస్తామని ధీమాతో ప్రకటించారు. అలాగే ఆత్మ నిర్భర భారత్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందులో భాగంగా దేశాన్ని నడిపించే ఏడు ప్రాథమిక శక్తులను ‘‘సప్తధార’’ తో ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడు రంగాలు కూడా భారత దేశాన్ని అన్ని రంగాల్లో కూడా చోదక శక్తులుగా నిలుస్తాయని ప్రకటించారు.
1. మాన్యుఫ్యాక్చరింగ్ :
దేశ తదుపరి వృద్ధికి మాన్యుఫ్యాక్చరింగ్ బాగా ఉపకరిస్తుందని, అదే బలమైన పునాది అని ప్రకటించారు. కేవలం చిన్న విడి భాగాల తయారీకే పరిమితం కాకుండా సంపూర్ణ ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ ను కీలక భాగస్వామిగా నిలబెట్టేందుకు ధర, నాణ్యత, ఉత్పత్తి అనే మూడు అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.
2. వ్యవసాయం – ఆహార భద్రత
సప్తధారలో రెండో అంశం వ్యవసాయం, ఆహార భద్రత. దేశ అభివృద్ధి ప్రయాణంలో వ్యవసాయ రంగం ప్రాధాన్యతను ప్రధాని నొక్కి చెప్పారు. ఆర్థిక వృద్ధిలో ఆహార ఉత్పత్తి, వ్యవసాయం ఎప్పటికీ కేంద్రబిందువులుగా వుంటాయన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, ఉత్పత్తిని మరింత పెంచాలన్నారు.
3. సాంకేతికత, ఆవిష్కరణలు
సప్తధారలో మూడోది సాంకేతికత, ఆవిష్కరణలు. ప్రపంచం డేటా సెంటర్లు, రోబోటిక్స్, సరికొత్త సాంకేతికతల యుగంలోకి అడుగుపెడుతోందన్నారు. ఈ రంగాల్లో భారత్ గ్లోబల్ హబ్ గా మారాలని కూడా మోదీ పిలుపునిచ్చారు. యూపీఐ విజయం ద్వారా భారత్ తన సాంకేతిక సామర్థ్ంయాన్ని ఇప్పటికే ప్రపంచానికి నిరూపించిందన్నారు. 6 జీ సాంకేతికతను అన్ని ప్రాంతాల్లోకి విస్తరించాలన్నారు.
4. మౌలిక వసతులు
నాల్గవ ధారగా మోదీ మౌలిక వసతులను పేర్కొన్నారు. గతి శక్తి ద్వారా అనుసంధానాన్ని పెంచాలన్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి, లాజిస్టిక్స్ మెరుగుపరచడానికి, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి రోడ్లు, హైవేలు అత్యంత కీలకమన్నారు. వాటిని నిరంతరం ప్రోత్సహిస్తామన్నారు.
5. రక్షా శక్తి
ఐదో ధార రక్షా శక్తి. రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, స్వదేశీ తయారీని బలోపేతం చేయడంపై దృష్టి పెడుతున్నామన్నారు. రక్షణ రంగంలో ఇదో మైలు రాయి అని అభివర్ణించారు. ముఖ్యంగా డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ వంటి వాటిపై కూడా దృష్టి పెట్టామన్నారు.
6. గ్రీన్ ఎనర్జీ
హరిత ఇంధనం ఆరో సప్తధార అని మోదీ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి క్లీన్ ఎనర్జీ సాంకేతికతల్లో ఆవిష్కరణలు చాలా ముఖ్యమన్నారు. పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరించడానికి వేగంగా అడుగులు వేయాలన్నారు.
7. భారత్ సాఫ్ట్ వేర్
2047 నాటికి దేశాన్ని సంపూర్ణ స్వయం సమృద్ధి కలిగిన వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో ఇది ప్రధాన పాత్ర అని మోదీ అన్నారు. యోగా, హస్తకళలు, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్, క్రియేటివ్ రంగాలు భారత సాఫ్ట్ వేర్ కి ప్రధాన స్తంభాలన్నారు. భారత పర్యాటక రంగానికి భారీ అవకాశాలు వున్నాయన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మరింత కృషి చేయాలన్నారు.








