Amazon: అమెజాన్ కస్టమర్లకు బిగ్ షాక్.. మళ్లీ ‘బైండింగ్’ నిబంధన అమలు
అమెజాన్ (Amazon) తన వినియోగదారుల ఒప్పందంలో (User Agreement) అత్యంత కీలకమైన మార్పు చేసింది. ఇకపై సంస్థపై వినియోగదారులు సామూహికంగా కోర్టుల మెట్లు ఎక్కకుండా (క్లాస్ యాక్షన్ లాసూట్) అడ్డుకునే ‘మధ్యవర్తిత్వ ఒప్పందం’ (Binding Arbitration) నిబంధనను మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు వినియోగదారులందరికీ ఈ-మెయిల్ ద్వారా అధికారికంగా సమాచారం అందించింది.
కోర్టులకు బదులు ఆర్బిట్రేషన్
ఈ కొత్త నిబంధన ప్రకారం, వినియోగదారులకు అమెజాన్‌తో ఏదైనా వివాదం తలెత్తితే సాధారణ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. దానికి బదులుగా ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అయితే చిన్న మొత్తాలకు సంబంధించిన వ్యక్తిగత కేసులను మాత్రం ‘స్మాల్ క్లెయిమ్స్ కోర్టు’లో దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆర్బిట్రేషన్ ద్వారా వివాదాలు వేగంగా, తక్కువ ఖర్చుతో పరిష్కారం అవుతాయని, ఇది వినియోగదారులకు మరింత సులభమైన మార్గమని కంపెనీ (Amazon) దీన్ని సమర్థించుకుంటోంది.
అసలు లక్ష్యం సామూహిక దావాలే!
ఈ నిబంధనను తిరిగి తీసుకురావడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం సామూహిక దావాలను (Class Action Suits) అడ్డుకోవడమే. ఒకే సమస్యతో వేలాది మంది కస్టమర్లు కలిసి కోర్టుకు వెళితే కంపెనీకి చట్టపరంగా, ఆర్థికంగా భారీ రిస్క్ ఉంటుంది. మధ్యవర్తిత్వ నిబంధనతో ఈ రిస్క్ భారీగా తగ్గుతుంది.
ఐదేళ్ల క్రితం అలెక్సా (Alexa) గోప్యతకు సంబంధించిన కేసుల నేపథ్యంలో అమెజాన్ (Amazon) ఈ నిబంధనను తొలగించింది. అప్పటి నుంచి సురక్షితం కాని ఉత్పత్తుల విక్రయాలు, ప్రైమ్ (Prime) సభ్యత్వాల రద్దు వంటి పలు అంశాలపై కంపెనీ భారీ స్థాయిలో క్లాస్ యాక్షన్ కేసులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ పాత నిబంధనను తెరపైకి తెచ్చింది. అయితే తాజా మార్పుతో సామూహిక కేసులకు పూర్తిగా తలుపులు మూసుకుపోయినట్లేనని కచ్చితంగా చెప్పలేమని న్యాయ, పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.








