షర్మిల ఎందుకు సైలెంట్ అయ్యారు..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila) గత కొంతకాలంగా పూర్తిగా సైలెంట్ అయిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆమె ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ వైద్య ప్రక్రియ ముగిసి కోలుకున్నప్పటికీ, రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత కీలకమైన రాజకీయ పరిణామాలపై ఆమె నోరు మెదపకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.
నిరంతరం ప్రెస్ మీట్లు, ట్వీట్లతో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడే షర్మిల హఠాత్తుగా మౌన వ్రతం పూనడం వెనుక అసలు కారణాలు ఏంటనే దానిపై భిన్నమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ (S.I.R) ప్రక్రియ ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా 43 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, వేలాది మంది ఓట్లను తొలగించడంపై ఇటు కూటమి, అటు వైకాపా మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.
దీనితో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమరశంఖం పూరిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. కనీసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోగా, ఈ మెగా పొలిటికల్ ఇష్యూలపై షర్మిల ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కాంగ్రెస్ క్యాడర్‌ను సైతం అయోమయంలోకి నెట్టేసింది. ఒకప్పుడు ప్రజా సమస్యలపై పాదయాత్రలు చేసిన నాయకురాలు, ఇప్పుడు ఇంత పెద్ద వ్యవహారాలపై స్పందించకపోవడం ఆమె శైలికి పూర్తిగా భిన్నంగా ఉంది.
ఈ సుదీర్ఘ మౌనం వెనుక తెరవెనుక పెద్ద పొలిటికల్ గేమే నడుస్తోందని అంతర్గత వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సొంత అన్న, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆస్తుల వివాదాలు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలపై స్పందిస్తే అది వైకాపాకు లాభిస్తుందనో, లేదా కూటమికి వ్యతిరేకంగా వెళ్లడం ఇష్టం లేకనో ఆమె వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరైతే.. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు వైకాపాతో ఏమైనా లోపాయికారీ ఒప్పందాలు జరిగాయా? అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతికే పరిమితమైన షర్మిల.. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారో చూడాలి.








