డ్వాక్రా మహిళలకు సువర్ణావకాశం.. ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్..!
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (SHG) మహిళల ఆర్థిక వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త స్వయం ఉపాధి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా ప్రముఖ కాఫీ, టీ బ్రాండ్లయిన ‘నేటివ్ అరకు కాఫీ’, ‘చాయ్ రాస్తా’, ‘గాటోస్ కేఫ్’ సంస్థలతో సెర్ప్ (SERP) అధికారులు ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ వినూత్న ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు 5 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 140 మోడల్ కేఫ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే ఈ సెంటర్లను ప్రారంభించిన మహిళలు తమ వ్యాపార ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.30 వేల నుండి రూ.1 లక్ష వరకు నికర ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక బిజినెస్ యూనిట్ల ఏర్పాటుకు ఎంచుకునే మోడల్‌ను బట్టి రూ.4 లక్షల నుండి రూ.6.7 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు వెల్లడించారు. ఉదాహరణకు, నేటివ్ అరకు కాఫీలో కంటెయినర్, వర్కింగ్, కరెంట్ అనే 3 మోడల్స్ అందుబాటులో ఉండగా, వీటి నిర్మాణానికి రూ.3.9 లక్షల నుండి రూ.5.9 లక్షల వరకు వ్యయం అవుతుంది.
అలాగే చాయ్ రాస్తా సెంటర్లు 4 విభిన్న మోడల్స్ లో రూ.3.9 లక్షల నుండి రూ.6.7 లక్షల వరకు, గాటోస్ కేఫ్ ఏర్పాటుకు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. డ్వాక్రా మహిళలు తమ వీలును బట్టి నచ్చిన మోడల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ వ్యాపారం ద్వారా కేవలం 5 నెలల్లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి చేతికి రావడం విశేషం. ఈ వ్యాపారాలపై ఆసక్తి ఉన్న డ్వాక్రా మహిళలకు ఆర్థిక భారం కలగకుండా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వంద శాతం రుణ సదుపాయాన్ని కల్పిస్తోంది.
దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ పీఎంఈజీపీ (PMEGP) పథకాన్ని అనుసంధానించడం ద్వారా లబ్ధిదారులకు ఏకంగా 35 శాతం సబ్సిడీ లభిస్తుంది. అంతేకాకుండా, ప్రభుత్వం చేసిన ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఆయా బ్రాండెడ్ కంపెనీలు మహిళల నుండి ఎలాంటి రాయల్టీ ఫీజును వసూలు చేయడం లేదు. స్వయం ఉపాధి సాధించాలనుకునే ఆసక్తి గల డ్వాక్రా మహిళలు తక్షణమే తమ జిల్లాల్లోని ‘వెలుగు’ (DRDA) కార్యాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.








