నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ ఫోకస్!
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీ అంశం అత్యంత కీలకంగా మారింది. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండే దాఖలాలు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం శ్రమించిన శ్రేణులకు సముచిత స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వంలో, పార్టీలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆశావాహులకు త్వరలోనే నామినేటెడ్ బెర్త్‌లు దక్కనున్నాయి. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తెచ్చి, క్షేత్రస్థాయిలో కేడర్‌ను మరింత ఉత్సాహపరిచేందుకు పీసీసీ, ఏఐసీసీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సుమారు 50 కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు తుది జాబితాను సిద్ధం చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. తయారైన అభ్యర్థుల జాబితాను సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు అందజేయనున్నారు. వీరిద్దరి ఆమోదముద్ర లభించిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 2024 జులైలో రెండేళ్ల కాలపరిమిసితో నామినేటెడ్ పదవులు చేపట్టిన కొందరి పదవీకాలం ముగిసింది. మరికొన్ని స్థానాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. అయితే, గతంలో పదవులు పొంది కూడా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించని వారిపై అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. కేవలం పదవులు అనుభవించి క్షేత్రస్థాయిలో పనిచేయని వారికి కాకుండా, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్న నిజమైన కార్యకర్తలు, నాయకులకే ఈసారి పెద్దపీట వేయాలని అధిష్టానం నిర్ణయించుకున్నట్లు సమాచారం.
నామినేటెడ్ పదవుల పంపిణీలో సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తగిన నిష్పత్తిలో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, జనాభా ప్రాతిపదికన మాదిగ సామాజికవర్గానికి సముచిత స్థానం దక్కాలని ఆ వర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా చేపట్టిన కులగణన నివేదికల ఆధారంగా, గతంలో నామినేటెడ్ పదవుల్లో పెద్దగా ప్రాతినిధ్యం దక్కని అణగారిన కులాలకు సైతం అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల నుంచి క్షేత్రస్థాయి శ్రేణుల జాబితాలను తెప్పించుకుంటున్నారు.
ఈసారి నామినేటెడ్ జాబితాలో కొందరికి మళ్లీ ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. జులై నాటికి పదవీకాలం పూర్తయిన నిర్మలా జగ్గారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, శివసేనారెడ్డి, మెట్టు సాయికుమార్, ఈరవత్రి అనిల్, బెల్లయ్య నాయక్, ప్రీతం, మల్రెడ్డి రాంరెడ్డి, నూతి శ్రీకాంత్ తదితరుల పేర్లు ఈసారి పరిశీలనలో ఉన్నాయి. ఒకవేళ శివసేనారెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం రాకపోతే తిరిగి నామినేటెడ్ పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వీరే కాకుండా తొలిసారి నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న యువ నాయకులు, సీనియర్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా అధిష్టానంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, గ్రౌండ్ రియాల్టీని బట్టి పార్టీకి ఉపయోగపడేవారికే పదవులు కేటాయించాలన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.








