22ఏ భూ వివాదాలపై ఎట్టకేలకు కమిటీ..! సమస్య పరిష్కారమవుతుందా?
తెలంగాణలో గత కొంతకాలంగా 22ఏ నిషేధిత భూముల సమస్య ప్రధాన చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోక, పేద రైతులను, సామాన్య భూ యజమానులను నిద్రపోనివ్వని ఈ సమస్యపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు, సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ అధ్యక్షతన ముగ్గురు సీనియర్ అధికారులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది. ఈ కమిటీ త్వరలోనే విధివిధానాలను ఖరారు చేసి, నిషేధిత జాబితాలోని వివాదాలను సమగ్రంగా పరిశీలించనుంది.
అటవీ, అసైన్డ్, దేవాదాయ శాఖలకు చెందిన సుమారు 1 కోటి 2 లక్షల ఎకరాల భూమి 22ఏ నిషేధిత జాబితాలోనే ఉంటుందని, వాటిని తొలగించే అధికారం మంత్రులకు కూడా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన తప్పులు, అధికారుల పొరపాట్ల వల్ల లక్షలాది మంది ప్రైవేట్ భూములు సైతం ఈ జాబితాలో చేరిపోవడంతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ధరణి పోర్టల్ పుణ్యమా అని రాష్ట్ర భూముల వివరాలు విదేశీ మాఫియా చేతికి వెళ్లాయని, మన రైతుల డేటా విదేశీయుల వద్ద భద్రపరచబడిందన్న తీవ్ర ఆరోపణలు రాజకీయ దుమారాన్ని రేపాయి.
ఈ నేపథ్యంలో 22ఏ జాబితాలో ఉన్న 12 ప్రధాన అంశాలను ప్రభుత్వం గుర్తించింది. అధికారుల లోపాలను సరిదిద్దుతూ, పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ హైలెవెల్ కమిటీ పనిచేయనుంది. మరోవైపు, ఈ భూసమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఎం తీవ్రంగా మండిపడ్డారు.
భూముల అంశం కేవలం పరిపాలనాపరమైన సమస్యగానే కాకుండా, విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు సర్వస్వం కోల్పోతే, కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్లు, వందల ఎకరాలు సంపాదించుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో కల్వకుంట్ల కుటుంబం, వారి బంధువుల పేరిట 9 జిల్లాల పరిధిలో ఉన్న 439.30 ఎకరాల భూముల వివరాలను సర్వే నంబర్లతో సహా అసెంబ్లీలో బహిరంగపరిచారు.
ముఖ్యంగా, కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూమిలో ప్రభుత్వ భూములతో పాటు రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములు కూడా ఉన్నాయనే ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై రాబోయే 30 రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సిద్దిపేట కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం పేరిట కూడా వందల ఎకరాల భూములున్నాయని, త్వరలోనే ఆ లెక్కలన్నింటిని ప్రజల ముందుంచుతామని బీఆర్ఎస్ ప్రముఖ నేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రతిఘటించారు.
ఒకవైపు 22ఏ భూముల బాధితులకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని వేయడం అభినందనీయమైన పరిణామమే అయినప్పటికీ, దీనికి రాజకీయ రంగు పులుముకోవడం వల్ల అసలు సమస్య పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. పేదల భూముల జోలికి ఎవరొచ్చినా ఉపేక్షించబోమని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో, ఈ కమిటీ నివేదిక ఎలాంటి సంచలన విషయాలను వెలుగులోకి తెస్తుందో, దశాబ్దాల కాలంగా వేధిస్తున్న ఈ భూ శాపానికి ఏ విధంగా శాశ్వత పరిష్కారం లభిస్తుందో వేచి చూడాలి.








