తానా లో వర్గ విభేదాలు ఇంకెన్నాళ్లు ? 2027 లో తానా యాబై ఏళ్ల పండుగ జరుగుతుందా ?
అమెరికాలో ఎన్ని తెలుగు సంఘాలు జాతీయస్థాయిలో ఉన్నా, మాతృసంస్థగా తానాకి ఒక ప్రత్యేకత, ఒక గౌరవం ఉంది. పెరుగుతున్న తెలుగు కమ్యూనిటీ వలన తెలుగు సంఘాలు పెరగటంలో తప్పులేదు పైగా ఎక్కువ సంఘాలు, ఎక్కువ మంది సభ్యులు, ఎక్కువ సేవలు అనుకునే వాళ్లలో నేను ఒకడిని. కమ్యూనిటీకి తానా, నాట్స్ ఒక సంవత్సరం, ఆటా, టీటీఏ మాటా ఇంకొక సంవత్సరం (నాటా మూత పడింది) జాతీయ స్థాయిలో మహా సభలు చేయడం చూస్తున్నాం. ఎక్కువ సంఘాలు – ఎక్కువ సమావేశాలు – ఎక్కువ సేవలతో పాటు ఎక్కువ ఖర్చు – ఎక్కువ శ్రమ అని కూడా మనము గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో మూడు సంఘాలు చేసిన సభలు గురించి ఒక తెలుగు పెద్దాయన మాట్లాడుతూ “ఇది వరకు నేను ఒక పదివేల డాలర్లు ఒక సంఘానికి విరాళం ఇచ్చే వాడిని. ఇప్పుడు ఆ పది వేలే రెండు సంఘాలకు సర్ది ఇచ్చాను “ అన్నారు. కొంచెం అటూ ఇటుగా పరిస్థితి అదే.. పెరిగిన ఖర్చులతో సభలు నిర్వహించడం చాలా కష్టం గా మారింది.
తానా పరిస్థితి ఏమిటి?
4-5 సంవత్సరాలుగా తానాలో గడ్డు పరిస్థితి నడుస్తున్నట్టే లెక్క. 2019లో సతీష్ వేమన అధ్యక్షుడిగా తానా మహాసభలు వాషింగ్టన్ డీసిలో వైభవంగా జరిగాయి. ఆ తర్వాత అధ్యక్షుడిగా వచ్చిన జయ్ తాళ్లూరి కోవిద్ సమయంలో కూడా అటు అమెరికా లోను, ఇటు తెలుగు రాస్ట్రాలలోను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కానీ కోవిడ్ వల్ల 2021లో తానా మహాసభలు జరగలేదు. ఆ తర్వాత, అట్లాంటా నుంచి అంజయ్య చౌదరి లావు అధ్యక్షులుగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు, ఫిలడెల్ఫియాలో 2023లో తానా సభలు వైభవంగానే జరిపారు అని చెప్పాలి. 2023 తరువాతే తానాకు కష్టాలు మొదలయ్యాయి. తానా నాయకత్వం రెండుగా చీలిపోవడం. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ ఆ ఫలితాల మీద ఒక వర్గం కోర్టుని ఆశ్రయించడం. కోర్టులో రెండు వర్గాలు డబ్బు- శ్రమలతో న్యాయ పోరాటం చేయడం, చివరికి కోర్టు ఇచ్చిన నిర్ణయంతో పోరాటానికి ముగింపు పలకడం జరిగింది. అయితే అగ్ర నాయకత్వంలో వచ్చిన విభేదాల పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని, అప్పటి తానా ఫౌండేషన్ ట్రెజరర్ శ్రీకాంత్ పోలవరపు తానా నిధులు మళ్లించడం జరిగింది. అగ్ర నాయకత్వంలో వచ్చిన విభేదాలు ఎలాంటి ఆపదలు తెస్తాయో 2023-24లో చూసినా 2025-27 నాయకులకు అర్ధం కాలేదని చాలా మంది తానా సభ్యులు బాధపడ్డారు.
తానాలో అంతర్గత సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయి?
తానా బోర్డు నిట్ట నిలువునా రెండుగా చీలి పోయిందన్న మాట అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేని పని, ఈ రాజకీయ నాయకుడు చేయలేని పని ..తానాలో ఆ రెండు వర్గాలు చేస్తున్నాయి అని చెప్పొచ్చు. దాదాపు 15 నెలలుగా (జూలై 2025 నుంచి నేటి దాకా) రెండు వర్గాలుగా విడిపోయి ఉండటమే.. తానా ఎగ్జిక్యూటివ్ బోర్డులో పదహారు మంది సభ్యులు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ బోర్డుకు చైర్మన్‌ని వారే ఎన్నుకుంటారు. ఆ చైర్మన్‌ని ఎన్నుకోవడంలో వచ్చిన విభేదమే 15 నెలల ప్రతిష్టంబన.
ఇప్పుడు తన ఆర్గనైజెషన్ నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
* తానా అగ్ర నాయకత్వంలో మూడు విభాగాలు ఉంటాయి. 1. తానా ఎగ్జిక్యూటివవ్ టీమ్, 2. తానా ఫౌండేషన్ టీమ్ 3. ఈ రెండింటిని సమన్వయ పరిచే తానా బోర్డ్.
* జూలై 2025న ప్రస్తుత నాయకత్వం ప్రారంభం అయినపుడు…
* డెట్రాయిట్ తానా మహాసభలో 2025-27కి ఎన్నికైన తానా ఎగ్జిక్యూటివ్ మెంబర్ లు అందరు బాధ్యతలు స్వీకరించారు. వారందరు కలిసి ఆ బోర్డుకు చైర్మన్‌ను నియమించుకోవాలి. అలాగే బోర్డులో ఖాళిలు ఉంటే భర్తీ చేసుకోవాలి. సాధారణ పరిస్థితులలో ఈ పని ఒక నెలలో జరిగిపోయి బోర్డు మీటింగ్ జరిపి తమ రెండేళ్ల సమయంలో చేయాల్సిన పనులు, వాటి ఆర్ధిక పరిస్థితులు, విధి విధానాలు చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలే ప్రణాళికలు, కార్యక్రమాలుగా మార్చుకుంటూ ముందుకి వెళతారు. కానీ తానాలో దురదృష్టవశాత్తు ఈ రోజు వరకు బోర్డుకి చైర్మన్‌ని నియమించలేదు. బోర్డు మీటింగ్ కూడా జరపలేదు.
తానా పెద్దలు ఏమయ్యారు?
కొన్ని సంవత్సరాలుగా పూర్వ అధ్యక్షులు శ్రీ జయరాం కోమాటి, గంగాధర్ నాదెళ్ల తానా పెద్దలుగా అందరితో మాట్లాడటం, సమస్యలు వస్తే రెండు గ్రూపులను కూర్చోబెట్టి సమస్యలను పరిష్కరించడం, వారి మాటను మిగతా వాళ్ళు వినడం జరుగుతూ ఉండేది. అలాగే, తానా బై లాస్ పరంగా ఏవన్నా అభిప్రాయాలు కావలసి వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, తానా పూర్వ అధ్యక్షులు శ్రీ జంపాల చౌదరి వాటిని పరిష్కరిస్తూ ఉండేవారు. సభ్యులు కూడా ఆయన మాటకు విలువ ఇస్తూ ఉండేవారు కూడా. 2000 తర్వాత అమెరికాలో వచ్చిన యువతను తానాలో చెరిపించడంలో సఫలికృతమై యువ నాయకులుగా పేరు తెచ్చుకున్న సతీష్ వేమన కూడా ఏ ప్రాంతంలో నైనా ఏదైనా సమస్య వచ్చినపుడు ఇరువర్గాలతోను మాట్లాడి ఒక్కటిగా చేసే వారు. ఆ తర్వాత తానా నాయకులుగా, సక్సెస్ఫుల్ ఇంటర్ప్రెన్యూర్స్ గా పేరు తెచ్చుకుని, యువకులకు మార్గదర్శకంగా నిలిచిన జయ్ తాళ్లూరి, అంజయ్య చౌదరి గారు లావు కూడా తానా పెద్దలుగా అనేక సమస్యలను సర్దుబాటు చేసేవారు.ఈ తానా పెద్దలు ఇప్పుడు ఏమయ్యారు? వారు పట్టించుకోవట్లేదా? లేదా వారి మాటని ఇప్పటి నాయకులు వినటం లేదా ? అని అనేకమంది బాధపడుతున్నారు.
తానా అధ్యక్షులు డా. నరేన్ కోడాలి కర్తవ్యం ఏమిటి?
రెండు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత కోర్టులో గెలిచి నాయకత్వం చేపట్టిన డాక్టర్ నరేన్ కొడాలి ముందు మూడు సమస్యలు – సవాళ్లు: 1. బోర్డు ని ఏర్పాటు చేసి బోర్డు మీటింగ్ లు జరిపి తానా పూర్తి స్థాయి దశా నిర్దేశం చేయడం 2. శ్రీకాంత్ పోలవరపు నుంచి తానా నిధులను వెనక్కి తీసుకురావడం. 3. యాభై సంవత్సరాల తానా పండుగని వైభవంగా చేసి, కమ్యూనిటీ లో.. ప్రజలలో తానాకున్న పూర్వ వైభవం తీసుకురావటం.
తానా బోర్డు ఏర్పాటు పూర్తి అవ్వాలంటే..
ఆలోచిస్తున్న కొద్దీ ప్రస్తుత సమస్య ఇద్దరు నాయకుల మధ్య అభిప్రాయం బేధం వలన కాలేదు అనిపిస్తోంది. ఎనిమిది మంది సభ్యులు చెరో వైపు ఇంత కాలం ఉన్నారంటే ఏదో బలమైన కారణం ఉంది ఉండవచ్చు. చిన్న కారణమైనా 15 నెలలలో జఠిలమై ఉండొచ్చు అని పిస్తోంది. వర్గ విభేదాలు వర్గపోరాటాలుగా మారకుండా మౌనంగా చూస్తూ ఉండటమా.. ‘వ్యక్తుల కంటే సంస్థ ముఖ్యం’ అనే సిద్ధాతం మీద కఠినంగా వ్యవహరించడమా ? ఇది 16 మంది సభ్యులు ఆత్మ పరిశీలన చేసుకునే అంశం!
తానాని మోసం చేసిన శ్రీకాంత్ పోలవరపు కేసు ఎంతవరకు వచ్చింది?
దాదాపు అతి పెద్ద ఫైనాన్సియల్ స్కాం గా ( 3.5 మిలియన్ డాలర్లు ) తానా నాయకత్వం ముందున్న శ్రీకాంత్ పోలవరపు కేసులో కూడా పెద్దగా పురోగతి లేదు. తానా నాయకత్వం శ్రీకాంత్ పోలవరపు మీద లీగల్ గా ముందుకెళ్లే సమయంలోనే తానాలో జరిగిన ఆర్ధిక లావాదేవీలుపై ఎఫ్బిఐ వాళ్ళు నోటీసులు ఇవ్వడం, దానికి తానా సమాధానాలు ఇవ్వడం జరిగాయి. అయితే ఎఫ్ బి ఐ ద్వారా పూర్తి స్థాయిలో జరిగే సివిల్ కేసు విచారణ నేపధ్యంలో డల్లాస్ లో శ్రీకాంత్ పోలవరపు మీద పెట్టిన కేసు కలిసి పోయింది. ఎప్పుడు ముందుకెళ్తుందో ..ఏమిటో ఎవరికీ తెలీదు.
తానా కార్యవర్గ సభ్యులందరికి విజ్ఞప్తి !
తానా బోర్డులో ఉన్న పదహారు మంది సభ్యులకు విజ్ఞప్తి. All said and done, organizations like TANA are president-driven institutions. తానా ప్రెసిడెంట్ మాటని, నిర్ణయాన్ని గౌరవించండి. అయన ప్రతిపాదించిన వ్యక్తిని బోర్డు చైర్మన్‌గా తీసుకోండి. మీ 24 నెలలలో 15 నెలలు అయిపోయాయి. మిగతా 9 నెలలలో మీ శక్తి సామర్ధ్యాలు చూపించుకునే అవకాశం వదులుకోకండి. ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనివాస్ లావు ప్రతిపాదనలు కూడా మంచివే. ఆయన కూడా ఒక యాంగెల్ ఆలోచించి ఆ ప్రతిపాదనలు చేసిఉంటారు. అయితే, ఆయన నిర్ణయాలని ఆయన ప్రెసిడెంట్ గా ఉండే 2027-29 సమయంలో అప్పటి బోర్డు సభ్యులు తీసుకుంటారు. 50 ఎళ్ల ఘనమైన చరిత్ర ఉన్న తానా ఇమేజ్ 5-6 ఏళ్లుగా కొద్దిగా మసక బారింది. దానిని స్వరోత్సవ సంబరాలతో సరిదిద్దాల్సిన బాధ్యత మీ అందరిమీద ఉందని మర్చిపోవద్దని మనవి చేసుకుంటున్నాము.
ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
తానాలో పూర్తిగా అంతర్గత విషయాలు అయినా ఇప్పుడు చెప్పక తప్పదు. తానాలో అనేక పదవులు నిర్వహించిన సీనియర్ సభ్యుడు, తానా బోర్డు లో ఇప్పటికే డైరెక్టర్ గా ఉన్న రవి పొట్లూరి పేరు ను తానా బోర్డుకి చైర్మన్ గా అధ్యక్షులు డా. నరేన్ కోడాలి ప్రతిపాదించగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనివాస్ లావు అందుకు ఒప్పుకోలేదు. ఆయన, ఆయనకు మద్దతుగా ఉన్న సభ్యులు మొదట ఇంతక్రితం తానా చైర్మన్ గా ఉన్న నాగేంద్ర శ్రీనివాస్ కొడాలిని ప్రతిపాదించారు. అందుకు డా. నరేన్ కొడాలి, ఆయన మద్దతు దారులు వప్పుకోలేదు.
ఆ తరువాత ఎం జరిగింది?
పదిహేనునెలలుగా ఇద్దరు నాయకులు, రెండు వర్గాలు విడివిడిగా, ఫార్మల్ గా, ఇన్ఫార్మల్ గా అనేకసార్లు మాట్లాడుకున్నారు. కానీ ఎక్కడా సయోధ్య కుదరలేదు. రాజి కి రాలేదు. డాక్టర్ నరేన్ కొడాలి మాటకు, ప్రతిపాదనకు మద్దతుగా నిలిచిన వారు – 1. డా. నరేన్ కోడాలి. 2. నిరంజన్ శృంగవరపు 3. రవి పొట్లూరి 4. వెంకట్ కోగంటి 5. భక్తా భల్ల, 6. సునీల్ పాంత్రా 7. అనిల్ ఉప్పలపాటి 8. హేమా కానూరు. అదేవిధంగా, అట్లాంటా వర్గం అనే పేరుతొ పిలవబడుతున్న ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనివాస్ లావుకు మద్దతుగా నిలిచిన వారు. 1. శ్రీనివాస్ లావు 2. డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి 3. రాజా కసుకుర్తి 4. భరత్ మద్దినేని 5. జానీ నిమ్మలపూడి 6. మల్లిక్ వేమన 7. శ్రీనివాస్ ఓరుగంటి 8. డా. ప్రసాద్ నల్లూరి. ఒక బోర్డులో పదహారు మంది సభ్యులు ఉన్నప్పుడు Áరెండు వర్గాలు అవడం ఒక్కో వైపు ఎనిమిది మంది చేరటం యాదృచ్ఛికమైనా, కాకతాళీయమైనా ఇప్పుడు అదే ఇప్పటి సంక్షోభానికి మూలకారణం.
తానా ఇన్నాళ్లుగా ఏం చేస్తోంది ?
తానా అగ్ర నాయకత్వంలో విభేదాలు ఉన్నా… తానా కార్యక్రమాలు సవ్యంగానే జరుగుతున్నాయి. ఉదాహరణకి, ఒక తానా మిడ్ అట్లాంటిక్ వర్గమే, జులై 2025 నుంచి ఇప్పటివరకు యాభై కార్యక్రమాలు చేసి, ఇప్పుడే 50వ కార్యక్రమం చేయబోతున్నానని ప్రకటించింది. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లోనూ కార్యక్రమాలు జరుగుతున్నాయి.మొన్న జరిగిన ఇండియా ఇండిపెండేన్స్ డే కార్యక్రమంలో కాలిఫోర్నియా తానా టీమ్ తానా స్వర్ణోత్సవ -50 సంవత్సరాల ప్రకటన కూడా ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ వాస్తవమే కూడా. అయితే, ఇవన్నీ ఆయా ప్రాంతాల్లో ఉన్న తన నాయకులు చేస్తున్న కార్యక్రమాలు మాత్రమే. అగ్ర నాయకత్వం పూర్తిగా బోర్డు మీటింగ్ జరిపి నిర్దేశించి చేయాల్సిన పనులు, పెద్ద కార్య క్రమాలు చాలా ఉన్నాయి.
తానా యాభై సంవత్సరాల పండగ మాటేంటి?
కొన్ని సంవత్సరాల్లో, మొదటగా TLCA న్యూయార్క్‌లో, తరువాత కాలిఫోర్నియాలో బాటా, ఈ మధ్యనే హ్యూస్టన్‌లో హౌస్టన్ తెలుగు సంఘం తమ తమ యాభై ఏళ్ళ పండుగని వైభవంగా చేసుకోవటం చూసాం. అలాంటిది, మాతృసంస్థగా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న తానా యాభై ఏళ్ళ పండగ మీద అందరికీ ఒక గొప్ప అభిప్రాయం ఉంది. అది ఒక డ్రీమ్. అది ఒక ఎమోషన్. ఆ కలని నిజం చేయాల్సిన బాధ్యత ఒక్క అధ్యక్షుడికే కాదు తానా కార్యవర్గ సభ్యులందరికి ఉంది.








