ముదురుతున్న వందేమాతరం, కాంగ్రెస్ వివాదం…
జాతీయ గేయం వందేమాతరం ఆలాపన విషయంలో కాంగ్రెస్ వివాదంలో ఇరుక్కుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై దుమారం రేగింది. జాతీయ పతాక ఆవిష్కరణ సందర్భంగా వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలాపించకుండా, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మధ్యలోనే అడ్డుకున్నారని, ఆపేయమన్నారని విమర్శలు వచ్చాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి, ఆ పార్టీ నేతలకు, జాతీయ అధ్యక్షుడికి పూర్తి వందేమాతరం ఆలాపించడానికి ఇష్టపడుతున్నట్లు లేదని బీజేపీ విరుచుకుపడుతోంది. కొందరి ఆలోచనా ధోరణి 1947 కి పూర్వం ఎలా వుందో ఆ తర్వాత అలాగే వుందని కూడా విరుచుకుపడుతున్నారు.
అలాగే రాజకీయాలకు అతీతులైన వ్యక్తులు కూడా ఈ పరిణామంపై స్పందిస్తున్నారు.బంకిం చంద్ర చటోపాధ్యాయ వారసుడైన సుమిత్రో చటర్జీ కూడా స్పందించారు. జాతీయ గీతం ప్రసారమవుతుండగా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమలో తాము మాట్లాడుకోవడం తన కుటుంబాన్ని “బాధించిందని” ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ విమర్శలను కాంగ్రెస్ ఖండిస్తోంది.‘‘వందేమాతరం గేయాన్ని ఆలపిస్తున్న సమయంలో ఖర్గే నిలబడి ఉన్నారు.. ఆయనకు కుర్చీ వేయాలని మాత్రమే సోనియా సైగ చేశారు. అంతేకానీ.. పూర్తిగేయాన్ని ఆపేయాలని ఆమె కోరలేదు.’’ అని కాంగ్రెస్ వివరించింది. ఈ వివాదంపై స్పందించిన సీనియర్ నేత జైరాం రమేశ్.. ‘‘1937, అక్టోబరు 28న కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందేమాతరం గేయంలోని ప్రారంభ చరణాలను మాత్రమే ఆలపించాలని మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, రవీంద్రనాథ్ఠాగూర్ వంటి పెద్దలు నిర్ణయించారు.’’ అని గుర్తు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రతికార్యక్రమంలోనూ వందేమాతరం ఆలపిస్తోందని, దీనిపై వివాదం లేదని, వారు సృష్టించారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించామని తెలిపారు.








